టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ టూర్‌లో..ఆయనెక్కడా..?

by Sridhar Babu |
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ టూర్‌లో..ఆయనెక్కడా..?
X

దిశ, కరీంనగర్: జిల్లాలో నిన్నటి టీపీసీసీ(తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్‌ ఉత్తమ్‌ పర్యటనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏకైక సిట్టింగ్ ఎమ్మెల్యే కానరాలేదెందుకు..? రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నా ఆ మాజీ మంత్రి కరివేపాకులా మిగిలారా..? నియోజకవర్గంలో ఉండి కూడా ఉత్తమ్‌ను కలవలేదేంటి..? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అధికారంలో లేకపోయినా వైరం కారణంగానే పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన ఆయన్ని పిలవలేదా లేక ఆయన రాలేదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

చీఫ్‌కు సన్నిహితుడే..

ఉమ్మడి జిల్లా నాయకత్వం విషయానికి వస్తే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సన్నిహితుల జాబితాలో మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు ఎక్కువ ప్రాధాన్యమే ఉంటుంది. ఇద్దరు ఒకేసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టడం, సహచర మంత్రులుగా పనిచేయడంతో ఉత్తమ్, శ్రీధర్ బాబుల మధ్య వ్యక్తిగత అనుబంధం ఎక్కువే. రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా, వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీధర్ బాబు గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగానూ కొనసాగారు. జిల్లాలో టీపీసీసీ చీఫ్ పర్యటన కూడా పంటల కొనుగోళ్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎత్తి చూపేందుకే సాగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, సివిల్ సప్లై మంత్రిగా పనిచేసిన శ్రీధర్ బాబు ఉత్తమ్‌తో లేకపోవడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలా ఆదుకున్నారు.. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయాలు ప్రత్యక్షంగా వివరించేందుకు శ్రీధర్ బాబు ఉంటే.. ఉత్తమ్ టూర్ కు ప్లస్ అయ్యేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పిలిచారా లేక ఆయనే రాలేదా..?

ఉత్తమ్ టూర్‌లో శ్రీధర్‌బాబు లేకపోవడం ఓ రకమైన చర్చకు దారి తీస్తే అసలు ఆయనను ఆహ్వానించారా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. టీపీసీసీ ఆఫీస్ బేరర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీధర్ బాబుకు అందరిలో సమాచారం ఇచ్చి ఉంటారే తప్ప ప్రత్యేకంగా రావాలని మాత్రం పిలుపు రాకపోయి ఉంటుందని సమాచారం. ఈ కారణంగానే శ్రీధర్ ఉత్తమ్ కుమార్ పర్యటనకు తనకు సంబంధం లేదన్నట్లుగా ఉన్నారని తెలుస్తోంది. వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ టూర్‌ను కూడా కరీంనగర్ లోకసభ నియోజకవర్గ పరిధిలోనే ప్లాన్ చేశారు. దీంతో తనకు సంబంధం లేని ప్రాంతానికి వెళ్లడం ఎందుకు అనుకున్నారని తెలుస్తోంది. అంతేగాకుండా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గం పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల పరిధిలోకి వస్తుందనీ, తనకు సంబంధం లేని జిల్లాకు వెళ్లడం ఎందుకుని అనుకున్నారా లేక వస్తే ఇక్కడి నాయకులు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉండదని శ్రీధర్ బాబు భావించారా అన్నది తేలాల్సి ఉంది. ప్రొటోకాల్ ప్రకారం చూసినా శ్రీధర్ బాబు కచ్చితంగా శుక్రవారం నాటి చీఫ్ పర్యటనలో ఉండాలనీ, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా పనిచేసినందున ఆయనను ఆహ్వనించాల్సి ఉండేదన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంటికే పరిమితం..

మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం మంథనిలోని తన ఇంటికే పరిమితం అయ్యారు. రోజూ కరోనా నివారణా చర్యల్లో పాల్గొనడం లేదా దాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలిస్తూ రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఉమ్మడి జిల్లా పర్యటన నేపథ్యంలోనూ ఆయన ఇంటికాడనే ఉన్నారు. ఆయన ఇంటికి వచ్చిన కొంతమంది కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులను కలిశారు తప్ప కనీసం కరీంనగర్ వెళ్లి ఉత్తమ్‌ను కలుస్తానని అనకపోవడం మంథని నాయకులకూ అంతుచిక్కకుండా తయారైంది. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న విభేదాల కారణంగానే శ్రీధర్ బాబు ఈ టూర్‌కు దూరంగా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags: TPCC Chief Uttam, District Tour, crop buying centres, checking, ex minister, MLA D.sridharbabu, stayed away

Advertisement

Next Story

Most Viewed