రైతులను వేధిస్తే.. రైస్‌ మిల్లర్లపై కఠిన చర్యలు

by Shyam |
రైతులను వేధిస్తే.. రైస్‌ మిల్లర్లపై కఠిన చర్యలు
X

దిశ, నిజామాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రైస్ మిల్లర్లను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరించారు.బుధవారం నిజామాబాద్ రూరల్‌కు చెందిన కొందరు రైతులు, సొసైటీ చైర్మన్ ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాము తీసుకువచ్చిన ధాన్యంలో తొర్ర, కడతా పేరుతో క్వింటాలుకు 3 నుంచి 7 కిలోల మేరకు తూకంలో మోసం చేస్తున్నారని రైతులు ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన బాజిరెడ్డి గోవర్ధన్ మిల్లర్లపై సీరియస్ అయ్యారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను సొసైటీ కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని సైతం బి గ్రేడ్‌గా పరిగణిస్తూ క్వింటాల్‌కు 3 నుంచి 7 కిలోల వరకు కడతా కొడుతున్న మిలర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా రైస్ మిల్లు యజమానులు తమ తప్పిదాలను గ్రహించి రైతులను మోసం చేయడం మానుకోవాలని హితవు పలికారు. అనంతరం రైస్ మిల్లర్లు రైతుల విషయంలో చేస్తున్న మోసంపై కలెక్టర్ సీ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డీఎస్‌సీవో సింహాచలం దృష్టికి బాజిరెడ్డి తీసుకెళ్లారు.

Tags: rice millers, formers, don’t struggle, mla bajireddy govardhan, collector narayanareddy

Advertisement

Next Story

Most Viewed