దారుణం: వర్షాలు పడాలని.. బాలికల బట్టలు విప్పి, రోడ్డుపై పరిగెత్తించి

by Anukaran |   ( Updated:2021-09-06 23:49:05.0  )
minor girls were naked and rotate for rain in damoh village
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం కొత్త కొత్త టెక్నాలజీలతో రోజుకో రంగు పులుముకుంటుంది. అయితే అంతరిక్షంలోకి ప్రయాణాలు చేస్తున్న కాలంలో కూడా కొంతమంది అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటివరకు వర్షాలు పడకపోతే కప్పలకు పెళ్లిళ్లు చేయడం, చెట్లకు పూజలు చేయడం వంటివి చూస్తూనే ఉంటాం. కానీ, మధ్యప్రదేశ్ లో వర్షాలు పడడం కోసం మూఢ ఆచారాలను ఆచరించడం కలకలం రేపుతోంది. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆరుగురు మైనర్ బాలికలను నగ్నంగా చేసి ఊరంతా ఊరేగించారు. ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే.. దామోహ్ జిల్లాలో జబేరా పోలీసు స్టేషన్‌ పరిధిలోని బనియా గ్రామంలో చాలా ఏళ్లుగా వర్షాలు పడడంలేదు. దీంతో అక్కడ వ్యవసాయ భూములు బీడుభూములుగా మారిపోయాయి. ఒక్క చినుకు కోసం ఎన్నో ఏళ్లుగా గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు. ఎన్నో పూజలు, యాగాలు చేసినా ఫలితం లేదు. దీంతో చివరగా ఒక దారుణ దురాగతానికి ఒడిగట్టారు. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆరుగురు బాలికలను నగ్నంగా చేసి.. కర్రలకు కప్పలను కట్టి వారి చేత గీతాగానం చేయిస్తూ రోడ్లపై పరుగులు పెట్టించారు. ఒక్కో బాలిక.. కప్పను కట్టిన ఒక్కో కర్రను భుజాన పెట్టుకొని భజనలు చేస్తూ వీధుల్లో తిరిగారు. ఇలా ఆరుగురు బాలికలు వీధుల్లో నగ్నంగా పరుగులు పెట్టారు.

గ్రామంలో వర్షాలు కురువక పంటలు ఎండిపోతున్నాయని, చిన్నారులను నగ్నంగా ఊరేగిస్తే వర్షాలు కురుస్తాయని నమ్ముతున్నామని గ్రామానికి చెందిన మహిళలు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి.. విచారణ చేపట్టింది. దీంతోపాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సోమవారం దామోహ్ కలెక్టర్‌కు లేఖ రాసింది. దీనిపై పది రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed