రైతులకు దారి చూపుతున్న తెలంగాణ మంత్రులు

by Anukaran |   ( Updated:2021-11-27 10:06:13.0  )
రైతులకు దారి చూపుతున్న తెలంగాణ మంత్రులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగిలో వరి వేస్తే ఉరే.. పారాబాయిల్డ్ రైస్ కొనం.. ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం లాంటి వ్యాఖ్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వినిపిస్తున్న సమయంలో రైతుల్లో గతంలో ఎన్నడూ లేనంత గందరగోళం నెలకొన్నది. స్వయంగా రాష్ట్ర మంత్రులే వరి సాగు వద్దంటూ రైతులకు పిలుపునిస్తున్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనవారు, మంత్రులుగా ఉన్నవారిలో చాలా మంది వ్యవసాయాన్నే వృత్తిగా చేపట్టినవారు ఉన్నారు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మంత్రులు వరి నుంచి ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. రైతులకు దారి చూపుతున్నారు.

పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బహిరంగంగానే తన కార్యాచరణను ప్రకటించారు. గతంలో వరి సాగు చేసినా ఈసారి మాత్రం ప్రత్యామ్నాయ పంటల కింద ఆయిల్ పామ్ వైపు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ సైతం రెండేళ్ల క్రితమే వరి సాగును మానివేసి 30 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు సైతం ఈసారి యాసంగిలో వరి సాగును నిలిపివేశారు. కొందరు పండ్లవైపు మళ్లితే.. మరికొందరు ఇతర పంటలవైపు వెళ్తున్నారు. ఇంకొందరు వారం పది రోజుల తర్వాత డెసిషన్ తీసుకుంటామంటున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేత మాత్రం వరినే సాగుచేస్తున్నారు. విత్తన అవసరాల కోసమే వరి వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే విత్తన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. రైతులందరికీ వరి వేయొద్దని పిలుపునిచ్చి మళ్లీ అదే పంటను వేయడంలో అర్థం లేదనే భావనతో ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నారు. పుష్కలంగా సాగునీటి సౌకర్యం ఉన్నప్పటికీ వరి జోలికి వెళ్ళొద్దనే నిర్ణయం తీసుకున్నారు. పిలుపునివ్వడమే కాదు ఆచరణలోనూ అదే చేస్తున్నామనే తీరులో బహిరంగంగానే రైతులకు ప్రకటనల ద్వారా తెలియజేస్తున్నారు. సంక్షోభానికి కారణం ఎవరనే సంగతి ఎలా ఉన్నా వరి సాగును మాత్రం ఈసారి యాసంగికి పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.

అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా చాలా మంది ప్రజా ప్రతినిధులు, మాజీలు వారికున్న పదుల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం తలెత్తిన ప్రత్యేక సంక్షోభంతో ప్రత్యామ్నాయ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. కొద్దిమంది మంత్రులు బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పినా చాలా మంది ప్రకటించలేదు. రైతులకు మాత్రమే వరి సాగు వద్దనే నిబంధన వర్తిస్తుందా, ప్రజా ప్రతినిధులకు వర్తించదా అనే చర్చకు తావు లేకుండా, విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా అధికార పార్టీ నేతలు ఈ తరహా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రజా ప్రతినిధులను చూసి స్థానికంగా ఉండే రైతులు తప్పకుండా వరి సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లుతారన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ముందుచూపు ఉన్న ప్రజా ప్రతినిధులు రెండేళ్ళ నుంచే వరి సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించి ఆయిల్ పామ్, పండ్లు లాంటి సాగువైపు మళ్ళారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. స్వయంగా ఆయనే పలు సందర్భాల్లో వెరైటీ కూరగాయల సాగు గురించి, గ్రీన్ హౌజ్ ఫార్మింగ్ గురించి ప్రస్తావించారు. ఇప్పుడు యాసంగికి అనూహ్యంగా వచ్చిన క్రైసిస్‌తో ప్రజా ప్రతినిధులతో పాటు వారి బాటలో వెళ్ళే రైతులు కూడా వరి సాగును తగ్గించుకునే అవకాశం ఉంది. దీంతో ఈసారి కనిష్ట స్థాయిలోనే వరి పంట విస్తీర్ణం ఉండనున్నది.

నేను వరి వదిలేస్తున్నాను : గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి

“రాష్ట్రంలోని రైతులకు మార్గదర్శకంగా ఉండేలా నేను ఈసారి వరి సాగును వదిలేస్తున్నాను. దానికి బదులుగా ఆయిల్ పామ్ సాగువైపు వెళ్తున్నాను. నా వ్యవసాయ క్షేత్రాన్ని దానికి తగినట్లుగా మల్చుకుంటున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, ఎక్కువ లాభాలు, కచ్చితమైన మార్కెటింగ్ సౌకర్యం ఉంటుంది. చీడపీడల బెడద కూడా తక్కువ. పైగా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు కూడా ఉన్నాయి. వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు లాంటి ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం. పెసర, మినుము, కంది తదితర పంటలు వేసుకోవాల్సిందిగా వ్యవసాయ మంత్రి ఇప్పటికే పిలుపునిచ్చారు. రైతులంతా వరిని మానేసి ఈ ప్రత్యామ్నాయ పంటలను పండిస్తే మంచిది”.

నేను రెండేళ్ళ కిందటే వరి మానేశాను : బాల్క సుమన్, ఎమ్మెల్యే

“వరి సంక్షోభం ఇప్పుడు వచ్చినా నేను రెండేళ్ళ ముందే మేలుకున్నాను. రాష్ట్రంలో, దేశంలో పంటల దిగుబడి చూసిన తర్వాత ప్రత్యామ్నాయ పంటలే మేలు అని గ్రహించాను. అందుకే ఆయిల్ పామ్‌పై దృష్టి పెట్టాను. మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఎక్కువగా ఉన్నది. స్వయంగా అశ్వారావుపేట లాంటి ప్రాంతాలను పరిశీలించాను. నాకున్న 30 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతున్నది. నా నియోజకవర్గంలో సుమారు 600 ఎకరాల్లో సాగవుతున్నది. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా రైతులు ఈసారి వరి సాగును తగ్గించాలి. స్వంత అవసరాలు, విత్తన కంపెనీలతో ఒప్పందం, రైస్ మిల్లర్లతో కుదిరిన అవగాహన ఉంటే మాత్రమే వరిని సాగుచేయాలి. విక్రయాల కోసమైతే వద్దు”.

Advertisement

Next Story

Most Viewed