మామలు..కోడళ్లు..కూతుర్లు..ఓ మేయర్ కుర్సీ !

by Shyam |
మామలు..కోడళ్లు..కూతుర్లు..ఓ మేయర్ కుర్సీ !
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తుండటంతో అధికార టీఆర్ఎస్‌ పార్టీలో లాబీయింగ్‌లు మొదలయ్యాయి. ఈసారి గ్రేటర్‌ కుర్చీ జనరల్ మహిళకు కేటాయించడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబసభ్యులను కుర్చోబెట్టేందుకు వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇదేక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కలిసి బతిమిలాడుతున్నారు. తమ ఫ్యామిలీ మెంబర్‌కు ఖచ్చితంగా అవకాశం కల్పించాలని ప్రగతిభవన్‌కు క్యూ కడుతున్నారు. పార్టీ కోసం తమ కుటుంబసభ్యులంతా తీవ్రంగా కష్టపడుతున్నారని, ఈసారి మేయర్ పదవి కట్టబెడితే ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తామని రిక్వెస్ట్ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి గ్రేటర్ మంత్రులు, ఎమ్మెల్యేల హడావుడితో ప్రగతిభవన్‌ కళకళలాడుతోంది.

ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్‌ మంగళవారం కుషాయిగూడలో అనుచరులతో సమావేశమై ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన సతీమణి శ్రీదేవిని బరిలో దింపుతున్నానని, టీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు వస్తే మేయర్ పీఠం దక్కించుకోవచ్చని చెప్పినట్లు సమాచారం. దీంతో బుధవారం ఉదయం మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదవి.. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి వెళ్లారు. 2018అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్త రామ్మోహన్‌కు టికెట్ రానందున.. ఈసారి తనకు మేయర్‌గా అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని, మీ ఆశీస్సులు అందించి ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో ప్రజల కోసం ఎక్కువ పనిచేస్తామని వివరించారని టీఆర్ఎస్ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి.

అటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం.. కేటీఆర్, కవితకు ఫోన్లు చేసి తమ కోడళ్లకు మేయర్ పీఠం ఇవ్వాలని కోరుతున్నారు. ఇదేక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. కోడలు మహితకు గ్రేటర్‌ టికెట్ ఇప్పించేందుకు కేసీఆర్, కేటీఆర్‌తో మాట్లాడారని సమాచారం. సనత్‌నగర్‌లో తమ సామాజికవర్గం వారు ఎక్కువగా ఉన్నందున టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పినట్లు టాక్. ఇదేక్రమంలో మేయర్‌ కుర్చీపై సైతం తమ మనసులోని మాటను బయటపెట్టారని మీడియా వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. 2019లోక్‌సభ ఎన్నికల్లో తమ కుమారుడు ఓటమి పాలైనందున, సింపతి కలిసివచ్చి పక్కాగా విక్టరీ కొడుతామని చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే మంత్రి మల్లారెడ్డి తన కూతురు మమతారెడ్డి కోసం టికెట్ ఆశించి అధికార పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. తమకు విద్యాసంస్థలు ఉన్నందున, పేదవర్గాల పిల్లలకు చదువుల విషయంలో కొంతమందికి ఫీజుల్లో రాయితీల విషయం కలిసి వచ్చి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు… వారి తల్లిదండ్రుల ఓట్లు సైతం తమకే పడి గెలుపు సునాయసం అవుతుందని కేటీఆర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రిగా తన పలుకుబడితో పాటు మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తన అల్లుడి సింపతి సైతం ఇప్పుడు యూజ్ అయి గ్రేటర్‌లో ఎలక్షన్‌లో విజయం సాధిస్తామని, ఇదేక్రమంలో ఇంకా మేయర్ పీఠం అప్పగిస్తే 24గంటలు ఇక పార్టీ కోసమే పనిచేస్తామని చెప్పినట్లు సమాచారం.

డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌.. కోడలు శిల్పా రామేశ్వరి కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్న అనుభవంతో పాటు, 2018లో మంత్రి పదవి ఆశించినా.. డిప్యూటీ స్పీకర్ పదవే కట్టబెట్టారని ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో తన కోడలుకు టికెట్ కేటాయించి, మేయర్‌ మేఠం అప్పగించాలని కొద్దిగా గట్టిగానే హైకమాండ్‌ను అడిగిరాని టీఆర్ఎస్ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. మరోవైపు పీజేఆర్ కుమార్తె విజయలక్ష్మి మేయర్‌ పదవి కోసం పట్టుబడుతున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తన సోదరుడు వేరేపార్టీలో ఉన్నప్పటికీ తాను టీఆర్ఎస్‌లో చేరి పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్నందున ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు సైతం.. తన కూతురికి మేయర్‌ పీఠం కావాలని పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి సైతం తన కోడలుకు మేయర్‌ పీఠం కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తనపై గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని టీఆర్ఎస్‌లోకి తీసుకువచ్చి మంత్రి పదవి ఇచ్చారని, తనకు ఎమ్మెల్సీ ఆశచూపి ఇంతవరకు ఏదీ డిసైడ్ చేయలేదని, ఈ గ్రేటర్ ఎన్నికల్లో అయినా తన కోడలుకు టికెట్ ఇచ్చి మేయర్‌ను చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అటు.. నాయిని నర్సింహారెడ్డి కూతురు సైతం మేయర్‌ పీఠంపై ఆశలు పెంచుకుంటున్నారు. 2018 ఎన్నికల్లో తన భర్తకు ముషీరాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, ఇప్పుడైన తనకు టికెట్ కేటాయించి బల్దియా పీఠంపై కూర్చోబెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనతండ్రి టీఆర్ఎస్‌కు చేసిన సేవలను గుర్తించైనా తనను ప్రోత్సహించాలని కేటీఆర్‌ను కోరినట్లు సమాచారం. అయితే.. ఎన్నికలు పూర్తయి అప్పటి పరిస్థితులను బట్టి మేయర్‌ పీఠాన్ని కన్ఫామ్ చేద్దామని, ఇప్పుడే అలాంటి హామీలు ఇస్తే ఇబ్బందులు వస్తాయని ముందుగా పార్టీ గెలుపునకు కృషి చేయాలని కేసీఆర్, కేటీఆర్, కవిత స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed