కంటోన్మెంట్‌ను GHMCలో విలీనం చేయాల్సిందే : TRS మంత్రులు

by Shyam |   ( Updated:2021-09-23 04:13:04.0  )
కంటోన్మెంట్‌ను GHMCలో విలీనం చేయాల్సిందే : TRS మంత్రులు
X

దిశ, కంటోన్మెంట్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని GHMCలో విలీనం చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పశుసంవర్దక, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రసూల్ పుర‌లో కట్ట మైసమ్మ ఆలయానికి సిల్వర్ కాంపౌండ్‌, రూ. 17.36 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన జి+3 అంతస్తులతో 8 బ్లాక్‌లలో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను హోం మంత్రి మహమూద్ అలీ, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, శాసన సభ్యులు సాయన్నలతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఈ ప్రాంతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేపథ్యంలో అభివృద్ధికి దూరంగా ఉందని ఇక్కడ పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏమాత్రం నిధులు తెచ్చే అవకాశం లేదన్నారు. కంటోన్మెంట్ ఏరియా చుట్టు ప్రక్కల ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీలో విలీనమైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయన్నారు. కంటోన్మెంట్ ఏరియా పది వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని జీహెచ్ఎంసీలో విలీనం అయితే పేదలకు మరిన్ని గృహాలు నిర్మించి ఇవ్వవచ్చని అన్నారు.

తద్వారా పేదలు గొప్పగా బ్రతికే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగత ప్రాంతాలలో మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. బీదలు ఆత్మాభిమానంతో గొప్పగా బ్రతకాలనే ఆశయంతో రెండు పడకల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా మిగిలిపోయిన లబ్ధిదారులకు 56 గృహాలను మంత్రి మంజూరు చేశారు. రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడుతారు. వారు ఇక్కడికి వచ్చి చూడాలన్నారు.

రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేని విధంగా రెండు పడకల గదులను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తూ నిరుపేదలకు అందిస్తున్నట్లు తెలిపారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు ఆసరా ఫించన్లు, షాదీ ముబారక్ లాంటి పథకాలు మరెక్కడా లేవన్నారు.

కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతానికి నిధులు మంజూరు కాక అభివృద్ధి జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేసింది. ధనవంతులు నివసించే గృహాల మాదిరిగా డబుల్ బెడ్ రూం ఇండ్లను పేదలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

శాసన సభ్యులు సాయన్న మాట్లాడుతూ.. గతంలో ఈ కాలనీ ప్రజలకు ఆడ పిల్లలను ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదని, ముఖ్యమంత్రి కృషి మేరకు పేదల కోసం రెండు పడకల గృహాలను నిర్మించి పంపిణీ చేయడంతో పండుగ వాతావరణంగా ఉందని అన్నారు. మరొక 56 గృహాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రులు 168 మంది లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జీహెచ్ఎంసీ హౌసింగ్ ఓయస్‌డి శంకరయ్య, ఆర్డిఓ వసంత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్‌చార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సాదాకేశవరెడ్డి, జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు పాండు యాదవ్, ప్రభాకర్, లోక్ నాథం, నళిని కిరణ్, మాజీ కార్పొరేటర్ లాస్యనందిత, సీనియర్ నాయకులు గజ్జెల నగేశ్, ముప్పిడి గోపాల్, ముప్పిడి మధుకర్, పిట్ల నగేశ్, నాగినేని సరిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story