గ్రీన్‌జోన్‌ దిశగా నిజామాబాద్ అడుగులు : మంత్రి వేముల

by Shyam |
గ్రీన్‌జోన్‌ దిశగా నిజామాబాద్ అడుగులు : మంత్రి వేముల
X

దిశ,నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో వంద శాతం సక్సెస్ అయ్యామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా రెడ్‌జోన్ నుంచి ఆరెంజ్‌జోన్ జాబితాలోకి చేరిందని, త్వరలోనే గ్రీన్‌జోన్‌లోకి వెళ్లబోతోందని తెలిపారు. కరోనా నివారణపై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆదివారం ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నలభై రోజులుగా కరోనా నియంత్రణలో జిల్లా యంత్రాంగం, అత్యవసర సేవల విభాగం ప్రాణాలకు తెగించి సేవలందించారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 3,494 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచి కరోనా వ్యాప్తి చెందకుండా యంత్రాంగం సవాల్‌లుగా తీసుకొని పనిచేసిందన్నారు. మర్కజ్ యాత్రికులతో కరోనా విస్తరిస్తోందని గుర్తించి వైరస్‌ను వేగంగా నియంత్రణలోకి తీసుకోగలిగామన్నారు. 61 మంది పాజిటివ్ కేసులలో 32 మందికి నేరుగా కరోనా సోకగా వారి నుంచి 22 మంది ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా, ఐదుగురికి సెకండరీ కాంటాక్ట్ ద్వారా, ఒకరికి విదేశాల నుంచి రావటం ద్వారా కరోనా సోకిందని, ఇందులో ఇప్పటికే 47 మంది డిశ్చార్జి అయ్యారన్నారు. 14 మంది మాత్రమే ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారని, త్వరలోనే వీరు కూడా ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,035 శాంపిళ్లను సేకరించామని, ర్యాండమ్‌గా శాంపిళ్లు కూడా సేకరించి పరీక్షలు జరిపామన్నారు. కమ్యూనిటీ వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతో ఉపయోగపడిందన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, డీసీసీబీ వైస్‌చైర్మన్ కే రమేశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ శర్మ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: Minister Vemula prashanth reddy,pragathi Bhavan,corona virus,review

Advertisement

Next Story