దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే.. మోదీ గడ్డి పీకుతున్నారా: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Shyam |
దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే.. మోదీ గడ్డి పీకుతున్నారా: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, డిండి: బండి సంజయ్ తలపెట్టిన దీక్ష నిరుద్యోగ దీక్ష కాదు, సిగ్గులేని దీక్ష అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొండమల్లేపల్లి పట్టణంలోని పాల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశ నిరుద్యోగ యువతకు ఏం చేసిందో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని ఏ గంగలో కలిపారో చెప్పాలి అని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో దేశానికి లెక్క చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. మీ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పగలరా అని సూటిగా అడిగారు.

లక్షలాది యువత ఐటీ జాబ్స్ గండి కొట్టి.. యువతరం నోట్లో మట్టికొట్టి.. మళ్లీ మీరే సిగ్గుఎగ్గూ లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా అని ప్రశ్నించారు. కేంద్రంలోని మీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగిత రేటు గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి చేర్చిన ఘనత మీది అని ఎద్దేవా చేశారు. బూటకపు దీక్షకు పూనుకున్న మీరు రాష్ర్ట యువతను రెచ్చగొట్టి, వారిని చదువు నుంచి, ఉద్యోగ ప్రయత్నాల నుంచి దృష్టిని పక్కదారి పట్టిస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో అని అన్నారు.

రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం బీజేపీకి కొట్టిన పిండేనని, ఆ పార్టీ విష సంస్కృతిలో ఇదంతా భాగమేనని మంత్రి కేటీఆర్‌ తనయుడిపై చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న వాడిన జుగుప్సాకరమైన భాషను ఖండిస్తున్నానన్నారు. బండి సంజయ్‌ ఏం చెబితే అది నవీన్‌ చేస్తాడని, చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎత్తుగడ వేసిందని, తెలంగాణలో ఇప్పుడదే చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ సమాజం బీజేపీ తీరును గమనించాలని విజ్ఞప్తి చేశారు.

సహనానికి, సంయమనానికి హద్దుంటది..

తమ సహనానికి, సంయమనానికి ఒక హద్దు ఉంటుందని, తీన్మార్‌ మల్లన్నకు రెండు చెంప దెబ్బలు చెప్పు దెబ్బలు కావాలన్నారు. మహిళలను, కుటుంబ సభ్యులను బీజేపీ కించపరుస్తోందని, ఈ ధోరణి బీజేపీకి మంచిది కాదన్నారు. తన ఆస్తులపై కూడా బీజేపీ సోషల్‌ మీడియాలో విష ప్రచారం నడుస్తోందని, ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న దానికన్నా ఎక్కువ ఆస్తులు ఉంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి రాసిస్తానన్నారు. బండి సంజయ్‌ నిరుద్యోగంపై దీక్షా చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే మోదీ ఏం చేస్తున్నారు.. గడ్డి పీకుతున్నారా? అని ప్రశ్నించారు.

జాతీయ స్థాయి నిరుద్యోగ రేటుతో పోలిస్తే రాష్ట్ర స్థాయి నిరుద్యోగ రేటు చాలా తక్కువని, పార్లమెంట్‌లో తెలంగాణ నిరుద్యోగ రేటు తక్కువ అని కేంద్రం చెప్పిందని, ఈ విషయం సంజయ్‌కి తెలియదా అన్నారు. సింగరేణిని కూడా ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్న కేంద్రప్రభుత్వాన్ని బండి సంజయ్ ఎందుకు నిలదీయరన్నారు.

బండి నిరుద్యోగ దీక్ష చేసే ముందు తాము అడిగి ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు అన్ని అంశాలపై ఢిల్లీలో గట్టిగా కొట్లాడారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి, సిరందాసు కృష్ణయ్య, హన్మంత్ వెంకటేష్ గౌడ్, మారుపాకుల సురేష్ గౌడ్, చింతపల్లి సుభాష్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమావత్ దసృ, ముత్యాల సర్వయ్య, గంధం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story