‘మేము మేలు చేస్తే.. మీరు కీడు చేయాలని చూస్తారా’

by Shyam |   ( Updated:2020-05-12 08:02:18.0  )
‘మేము మేలు చేస్తే.. మీరు కీడు చేయాలని చూస్తారా’
X

దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ కోసమని గొప్ప మనసుతో మేలు చేయాలని చూస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం కీడు చేయాలని చూడడం సరికాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గోదావరి నీళ్ళను నాగార్జునసాగర్‌కు తీసుకుని వద్దామని కేసీఆర్ ప్రయత్నం చేస్తుంటే ఏపీ సీఎం జగన్ కృష్ణా నీటిని అక్రమంగా తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ ఇష్టానుసారంగా చేస్తే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ చాలా ఆగ్రహంగా ఉన్నారని, ఏపీ ప్రయత్నాలను వందకు వందశాతం అడ్డుకుంటామని ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అపెక్స్ కమిటీ తీర్మానం లేకుండా ఇలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా తీసుకుంటాయో చెప్పాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. అయితే పాలమూరు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న అందరూ కలిసి వచ్చి ఆంధ్ర ప్రదేశ్ చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేసి మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు తావులేదని, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోయడం సరి కాదని పాలమూరు జిల్లా ప్రజల అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని సూచించారు.

Advertisement

Next Story