కేసీఆర్ అలా చేస్తే హైదరాబాద్ ఉండేది కాదా !

by Shyam |
కేసీఆర్ అలా చేస్తే హైదరాబాద్ ఉండేది కాదా !
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ పుణ్యమా అని రాష్ట్రంలో కిమ్మనకుండా ఉన్న నేతలు మళ్లీ స్టైల్ మార్చారు. లాక్‌డౌన్‌‌తో ఇన్నిరోజులు ఇంటి పట్టునే ఉండి సడలింపుల తర్వాత బయటకు వస్తున్న వారు సెగలు రేపే మాటలతో పొగలు కక్కిస్తున్నారు. ఒకరు ఏయ్ అంటే… నువ్వే వందసార్లు ఏయ్ అని రాజకీయాన్ని రగలిస్తూ రెచ్చగొడుతున్నారు. కరోనా నుంచి మొదలు పెట్టి పథకాలు, ప్రాజెక్టులపై ఒంటికాలుపై లేస్తున్నారు. ఈ మధ్యలో రచ్చయిన పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్, బీజేపీలు ఏమాత్రం తగ్గకుండా అధికార పార్టీని టార్గెట్ చేస్తుండగా అటు అదే రేంజ్‌ దూకుడును ప్రదర్శిస్తూ టీఆర్ఎస్ వర్గాలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. నిన్నటికి నిన్న కాంగ్రెస్‌, బీజేపీ దీక్షలు చేసి కేసీఆర్‌ టార్గెట్‌గా మాటలు అంటే వాటిని ఇంకా రగలించేలా మంత్రులు మాటలు అందుకొని కాంట్రవర్సీ పెంచుతున్నారు.

దీనిలో భాగంగానే గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా ఓం రేంజ్‌లో విమర్శలు చేశారు. పోతిరెడ్డిపాడుపై కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అసలు జాతీయ పార్టీలకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు. గతంలో పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు తరలిస్తుంటే కాంగ్రెస్ నేతలు హారతులు పట్టలేదా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు చెప్పిన తర్వాతే పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందని ఎవరైన అంటే అది మూమ్మాటికే తప్పే అన్నారు. అసలు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌ నేతలతో కుమ్మక్కైతే హైదరాబాద్ ఉండేది కాదన్నారు. పదవుల కోసం కుమ్మక్కయ్యే చరిత్రే కాంగ్రెస్ పార్టీకి ఉందని మంత్రి ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed