ఆ ఒక్క చోటనే 27 కరోనా కేసులు

by vinod kumar |
ఆ ఒక్క చోటనే 27 కరోనా కేసులు
X

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ రాష్ట్రంలో విజృంభిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ ప్రభావం వికారాబాద్ జిల్లాలో మొదట అంతగా లేదు. కానీ, గత 10 రోజులలోనే 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం వికారాబాద్ పట్టణంలోనే 27 కేసులు నమోదు కావడంతో ఆ ఏరియాను రెడ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఇల్లు వదిలి బయటకు రాకూడదని ప్రజాప్రతినిధులు, అధికారులు పిలుపునిచ్చారు. వారికి అవసరమైన నిత్యావసరాలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తున్నారు.

పట్టణంలో పర్యటించిన మంత్రి…

వికారాబాద్ పట్టణంలోని పలు కాలనీలలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పర్యటించారు. ముందుగా ఎన్నేపల్లి లో పర్యటించిన అనంతరం గంగారం కాలనీలో పర్యటించి కాలనీ వాసులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. కాలనీలో మాస్కులు కుడుతున్న వ్యక్తిని అభినందించారు. ఇదే సమయంలో పదో తరగతి పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారని కాలనీలోని పదో తరగతి విద్యార్థిని మంత్రిని అడగగా లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత పరీక్షల గురించి ఆలోచిస్తామన్నారు.

అదే విధంగా పట్టణంలో బీపీ రోగులకు వైద్య సహాయం అందించేలా చూడాలని రిటైర్డ్ ఉద్యోగులు మంత్రికి విన్నవించారు. కౌన్సిలర్ సురేష్ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు నిత్యావసర సరుకులను మంత్రి చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, డీఎంహెచ్ ఓ దశరథ్, మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలోని పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.

నిర్బంధంలో పట్టణ ప్రజలు…

వికారాబాద్ పట్టణంలో ఒక్కరు కూడా బయటకు రావడంలేదు. నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలను పూర్తిగా మూసివేశారు. పోలీసులు కాలనీల్లో గస్తీలు కాస్తూ అనసరంగా బయట తిరిగే వ్యక్తులపై కేసులు పెడుతున్నారు. అలాగే వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తున్నారు. ఈ నిర్బంధంతో పట్టణమంతా నిర్మానుష్యంగా మారిపోయింది.

tags: Vikarabad, Red Zone Area, Corona, Positive Cases, Police, Minister Sabitha, Tour

Advertisement

Next Story

Most Viewed