మీకు నేనున్నాను: సబితా ఇంద్రారెడ్డి

by vinod kumar |
మీకు నేనున్నాను: సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, రంగారెడ్డి: ‘వికారాబాద్ జిల్లా ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటాన’ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. వారు జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. తర్వాత కలెక్టరేట్‌లో హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మర్కజ్ వెళ్లొచ్చిన వారు ఉంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రతిక్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. కరోనా నియంత్రణకు సహకరించాలనీ, రోజూ బయటకు రాకుండా, వారానికి సరిపడా నిత్యావసర సరుకులను తెచ్చుకోవాలన్నారు. అలాగే, కరోనా నియంత్రణ చర్యలను మరింత కఠినంగా అమలు చేస్తామనీ, దీనికి సంబంధించి, మంగళవారం ఉదయం కలెక్టర్, ఎస్పీలు ఒక ప్రకటన విడుదల చేస్తారనీ, అందులోని నిబంధనలు అందరూ పాటించాలని తెలిపారు. జిల్లాలో 25 కేసుల నమోదు దృష్ట్యా ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీ జోన్‌లలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. సుభాష్ నగర్ కాలనీ, మార్కెట్‌లలో పర్యటించి ఇళ్ల నుండి బయటకు రావొద్దని ప్రజలను కోరారు. కరోనా లక్షణాలుంటే వికారాబాద్‌లోని మహావీర్ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే, రైతులు ఆందోళన చెందొద్దనీ, పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు మనమంతా రుణపడి ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, ఎస్పీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags: sabitha indra reddy, vikarabad, collectorate, coronavirus, collector pousami basu, mla methuku anandh


Advertisement

Next Story