‘ధరణి’తోనే రిజిస్ట్రేషన్లు : కేటీఆర్

by Anukaran |
‘ధరణి’తోనే రిజిస్ట్రేషన్లు : కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో :

భవిష్యత్‌లో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గత ఆరేండ్లలో దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందన్నారు. శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలో రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని, కేవలం ప్రజలకు వారి ఆస్తులపై హక్కులు కల్పించాలన్న ప్రయత్నమే చేస్తోందని తెలిపారు. భవిష్యత్‌లో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్‌ ఆధారంగానే జరుగుతాయని. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు ప్రత్యేకంగా వేర్వేరు రంగుల్లో పాస్‌ పుస్తకాలు ఇస్తామన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు భూ సమస్యలన్నీ తొలగిపోయాయని, వ్యవసాయేతర ఆస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

నిశ్చింతగా ఆస్తి హక్కులకు ప్రయత్నం..

జంట నగరాల ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా ప్రయత్నిస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. ఒక వైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్దఎత్తున హైదరాబాద్‌ విస్తరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ తమ వ్యవసాయ భూములపై హక్కులను కల్పించే లక్ష్యంతో ముందుకు పోతోందన్నారు.అలాగే, సామాన్యుడిపై ఎలాంటి భారం పడకుండా, అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టాన్ని రూపొందించామన్నారు. నగరంలో సుమారు 24 లక్షల 50వేల ఆస్తులు ఉన్నట్లు అంచనా వేశామన్నారు. ఇందులో వివిధ కారణాలతో కొన్నిఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. సమావేశంలో జోనల్ కమిషనర్లు, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed