కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పాస్ పోర్టులు జప్తుచేయాలి: రవీంద్ర నాయక్

by Mahesh |
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పాస్ పోర్టులు జప్తుచేయాలి: రవీంద్ర నాయక్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పాస్ పోర్టులు జప్తు చేయాలని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. వారు ప్రజాధనాన్ని ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుని దొంగే.. దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే అశాంతికి గురిచేస్తున్నారన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన అప్పటి సీఎంవో అధికారులు బీఆర్ఎస్ నేతల అవినీతి, దుర్మార్గాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారని, వారి భరతం పట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కేసీఆర్ పదేండ్ల పాలనలో ల్యాండ్, శాండ్, డ్రగ్స్, లిక్కర్, కార్ రేస్, గ్రైనేట్, ధరణి లాంటి ఎన్నో అవినీతి కుంభకోణాలు జరిగాయన్నారు. పదేండ్ల విధ్వంసాన్ని అడ్డుకుని గాడిలో పెట్టాలనుకుంటున్న రేవంత్ సర్కార్ ను చూసి ఓర్వలేక తమ అస్తిత్వాన్ని కోల్పోతామని బెంబేలెత్తి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రజలు.., కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. వారు కొట్టేసిన ప్రజాధనంతో కొన్ని మీడియా, కొన్ని సోషల్ మీడియాలను కొని కాంగ్రెస్ ను బదనాం చేయాలని చూస్తున్నారన్నారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు అవినీతిపై విచారణ వేగవంతం చేయాలని రవీంద్ర నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed