బండిపై సెటైర్.. పాదయాత్ర ఆరోగ్యానికి మంచిదే!

by Shyam |
బండిపై సెటైర్.. పాదయాత్ర ఆరోగ్యానికి మంచిదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ వచ్చిందని, యాత్రలు చేయడం ఆరోగ్యానికి మంచిదని… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కేటీఆర్ సెటెర్ వేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మహాత్మాగాంధీ ఇచ్చిన ‘క్విట్ ఇండియా’దినోత్సవ నినాదం స్ఫూర్తితో ఆగస్టు 9న ‘ప్రజాస్వామిక తెలంగాణ’ లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నట్లు బండి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అసలు పాదయాత్ర ఎందుకు చేపడుతున్నాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలతో గ్రామాలన్ని తిరిగి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధిని చూడాలని సూచించారు. రైతు వేదికలు, ప్రకృతివనం, డంపింగ్ యార్డులు, హరితహారంలాంటివి స్వాగతం పలుకుతాయని, ఇలాంటి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపడుతున్నారా..? అని ప్రశ్నించారు. రైతు బంధుకు రూ.7500 కోట్లు విడుదల చేసి 61లక్షల మందికి అందజేశామని, రైతు బీమాతో 39లక్షల మందికి భరోసా కల్పించామని, కేంద్రం కూడా తెలంగాణ పథకాలనే కాపీ కొడుతుందని విమర్శించారు. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed