- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వంపై పోరాటానికి దిగిన మినిస్టర్.. కోర్టులో కేసు
బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఏకంగా ప్రభుత్వంపైనే న్యాయపోరాటానికి దిగారు. సీఎం కేసీఆర్ ఆదేశాలే శిరోధార్యంగా భావించే మంత్రి గంగుల తనకు అధికారులు అన్యాయం చేశారంటూ కోర్టు మెట్లెక్కారు. తన భూమిని పీవోబీ( నిషేధిత భూముల జాబితా)లో చేర్చారంటూ హైకోర్టులో కేసు వేశారు. స్వయంగా కేబినెట్ లో ఉండి తాను అంగీకరించిన తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020, ధరణి పోర్టల్ విధానాలే మంత్రికి చేటు చేశాయి. రెవెన్యూ అధికారులకు చెప్పి విసిగి వేసారిన గంగుల ఏకంగా ప్రభుత్వంపై న్యాయపోరాటం ప్రారంభించారు.
కేసు నంబర్ 3743/ 2021గా దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శిని, వక్ఫ్ బోర్డును, కరీంనగర్ కలెక్టర్ ను, ఆర్డీవోను, కొత్తపల్లి తహసీల్దార్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పట్టాదారుగా అన్ని హక్కులు కలిగి ఉన్న తన భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. ఓఆర్సీ ( ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్) జారీ చేసిన భూములపై రాద్ధాంతం చేస్తున్నారని, డీనోటిఫై చేయకుండా జాప్యం చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. గంగుల కమలాకర్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ కొత్త చట్టానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేయడం విశేషం.
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ అంటే మంత్రులకు భయమని చెబుతారు. వారి అభిప్రాయాలను వెల్లడించేందుకు ఎవరూ సాహసించరంటారు. ఓ విధాన నిర్ణయాన్ని పెద్దాయన ప్రకటించారంటే మాట్లాడకుండా అంగీకరించాల్సిందేనన్నది టీఆర్ఎస్ వర్గాల మాట. సమస్యలొస్తాయని తెలిసినా విధానాలను వ్యతిరేకించేందుకు ఎవరికీ ధైర్యం చాలదనేది వారి అభిప్రాయం. పారదర్శకత, సేవల్లో వేగం పెంచేందుకు జరిగిన రెవెన్యూ సంస్కరణలు వేలాది మందిని ఇరుకున పడేశాయి. సాక్షాత్తూ బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తాను ఆమోదించి సంతకాలు చేసిన కొత్త చట్టం, విధానాలకు వ్యతిరేకంగా హైకోర్టు మెట్లెక్కక తప్పలేదు. సీఎం కేసీఆర్ ఆదేశాలే శిరోధార్యంగా భావించే మంత్రి గంగుల తనకు అధికారులు అన్యాయం చేశారంటున్నారు. అంతా చట్ట ప్రకారమే చేశామని అధికారులు వాదిస్తున్నారు. పాత ఆర్వోఆర్ చట్టం ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల్లోనూ పట్టాదారుల పేర్లున్నాయి. రికార్డుల చూసిన తర్వాతే కొనుగోలు చేశాను. ఇప్పుడేమో కొత్తగా తాను సంతకం పెట్టిన కొత్త ఆర్వోఆర్, ధరణి పోర్టల్ ద్వారా ఆ భూమి ప్రభుత్వానిదంటున్నారు. తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు అన్ని పత్రాలను సమర్పించినా, నచ్చజెప్పినా ససేమిరా అంటున్నారు. ఆ భూమి ముమ్మాటికీ వక్ఫ్ బోర్డుదేనంటూ నిషేధిత భూముల జాబితాలో పేర్కొన్నారు. ఎలాంటి క్రయ విక్రయాలు చేయొద్దని షరతు విధించారు. దీంతో మంత్రి గంగుల కమలాకర్ కు కోర్టును ఆశ్రయించడం అనివార్యమైంది. అయితే ప్రభుత్వంలోనే మంత్రిగా కొనసాగుతూ తాను ఆమోదించిన చట్టం, విధాన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ న్యాయం కోసం పోరాడుతుండటం విశేషం. తన స్థాయి, హోదాలో కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పొచ్చు. అన్ని హక్కులు తనకు ఉన్నాయని, కొనుగోలు చేసేటప్పుడు రికార్డులు చూశానని రుజువులు సమర్పించొచ్చు. అధికారులెవరూ వినకపోతే సీఎం కేసీఆర్ కు మొర పెట్టుకోవచ్చు. కానీ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రభుత్వం సదరు భూమిపై హక్కులు వదులుకుంటుందా? మంత్రి గంగుల కమలాకర్ కే హక్కులు కట్టబెడుతుందో వేచి చూడాలి.
అసలేం జరిగింది?
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కాజీపూర్ రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 126 లో 15.26 ఎకరాల భూమిని మంత్రి గంగుల కమలాకర్ కొనుగోలు చేశారు. అయితే పట్టాదారులకు అన్ని హక్కులు ఉన్నాయని పరిశీలించుకున్నారు. భూమి హక్కులపై ఎలాంటి పేచీ లేదని నిర్ధారించుకున్నారు. అయితే సదరు భూమి ఇనాంగా పొందినది. సయ్యద్ హమీదుద్దీన్ పేరిట ఉండేది. ఆయన కరీంనగర్ ఈద్గాలో ముత్తవల్లి. ఆయనకు అప్పటి గంగాధర తాలుకా పరిధిలోని ఎలగందల్, ఖాజీపూర్, వడ్డయిరాం గ్రామాల పరిధిలో ఇనాం భూములున్నాయి. ఆయన రాచకొండ గట్టయ్య, రాచకొండ హన్మయ్య, రాచకొండ రాజలింగం, రాచకొండ మీనయ్య, రాచకొండ లక్ష్మయ్య, రాచకొండ గౌరమ్మ, రాచకొండ రామయ్య, రాచకొండ నారాయణ, రాచకొండ లక్ష్మీరాజం, మహారాజ కేశవ, రాచకొండ ఆగయ్యలకు విక్రయించారు. కొనుగోలు చేసిన వారందరి పేర్లు రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కాయి. అలాగే రెవెన్యూ అధికార యంత్రాంగం వారికి పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేసింది. భూమి వారి స్వాధీనంలోనే ఉన్నది. ఇనాం అబాలిషన్ యాక్టు ప్రకారం పొందిన ఓఆర్సీ( ఆక్యుపెన్సీ రైట్ సర్టఫికెట్) ద్వారా హక్కులు పొందారు. ఈ విషయంపై కరీంనగర్ ఆర్డీవో కూడా సమగ్ర దర్యాప్తు చేశారు. సర్వే రిపోర్టును సర్వే ల్యాండ్ రికార్డుల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ నివేదికను సమర్పించారు. 2012లోనే ఇదంతా పూర్తయ్యింది. వాటి ఆధారంగానే ఓఆర్సీ ఇచ్చారని, కొనుగోలు చేసిన విస్తీర్ణాలను మ్యుటేషన్ కూడా చేశారు. 1971 ఆర్వోఆర్ యాక్టు ప్రకారం వారికి పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. అన్నీ అమల్లోనే ఉన్నాయి. దీంతో మంత్రి గంగుల కమలాకర్ కొన్నారు. కానీ తాను మంత్రిగా ఆమోదించిన తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020, ధరణి పోర్టల్ విధానాలేమో వివాదాస్పదం చేశాయి.
భూ రికార్డుల ప్రక్షాళనతో వివాదం
మూడేండ్ల క్రితం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. ఈ క్రమంలో మంత్రి కొనుగోలు చేసిన భూమి వివాదాస్పదంగా మారింది. అది పట్టా భూమి కాదని అధికారులు లెక్క తేల్చారు. వక్ఫ్ భూమిగా పేర్కొంటూ నిషేధిత భూముల జాబితాలో రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908, 22-ఏ కింద నమోదు చేశారు. ఏ పట్టాదారు పాసు పుస్తకాన్నీ రద్దు చేయలేదు. ఈ క్రమంలో సదరు భూమిని ఎవరికి విక్రయించొద్దంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. వక్ఫ్ భూమిగా నమోదు చేశారు. నేచర్ ఆఫ్ ల్యాండ్ తెలుసుకోకుండానే ఏ విధంగా పీఓబీ( నిషేధిత భూముల జాబితా) లో చేరుస్తారని ప్రశ్నించారు. ఓఆర్సీ జారీ చేసిన భూములపై హక్కులు లేవంటూ వివాదం చేశారని, డీ నోటిఫై చేయకుండా జాప్యం చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ హైకోర్టుకు మొర పెట్టుకున్నారు. ఈ భూమి వక్ఫ్ బోర్డుదిగా అధికారులు వాదిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ కార్యదర్శి, తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవో, కరీంనగర్ జిల్లా కలెక్టర్, కరీంనగర్ ఆర్డీవో, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి తహసీల్దార్లను ప్రతివాదులుగా చేర్చారు. మంత్రిగా ఉంటూ ప్రభుత్వంపై కేసు వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.