పోలీస్ కుటుంబాలు సంతోషంగా ఉండాలి.. అదే కేసీఆర్ లక్ష్యం

by Shyam |   ( Updated:2021-08-09 11:41:27.0  )
Minister Jagadish Reddy
X

దిశ, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మహిళల భద్రత కోసం భరోసా కేంద్రాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి, డీఐజీ ఏవీ రంగనాథ్ కలిసి తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ పీజే పాటిల్, ఎమ్మెల్యే కేబీఆర్‌తో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ కుటుంబాల్లో సంతోషం ఉండాలని దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆ వ్యవస్థకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులకు 30శాతం, హోంగార్డులకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని కొనియాడారు. 21వేల వాహనాలతో పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో పటిష్టంగా ఉందని, గత ప్రభుత్వాల హయాంలో దొంగలు ఇండ్లమీద పడి దోచుకు వెళ్లే వారని, విపరీతమైన చోరీలు జరగేవని, ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగేదని, తెలంగాణ ఏర్పడ్డాక అలాంటి ఘటనలు కనిపించడం లేదని అన్నారు.

గ్రామంలోనైనా పట్టణంలోనైనా ఒకటే పోలిసింగ్ అని, మహిళలు క్షోభకు గురికావద్దని, మహిళలపై జరిగే లైంగిక దాడులు అతిపెద్ద గాయాలని, వాటిని తగ్గించడానికే భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏ స్టేషన్ పరిధిలోనైనా భరోసా కేంద్రం సేవలు వినియోగించుకునే వెసులు బాటు ఉందని అన్నారు. కొత్త కంపెనీ స్థాపించాలనకునే వారు శాంతి బధ్రతలు దృష్టా హైదరాబాద్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. నేరస్థులు తప్పించుకోకుండా శిక్షలు పడేలా చేయడానికి భరోసా కేంద్రం ఏర్పాటు చేశామని, భారత్‌లోనే మొదటి ప్రయోగం తెలంగాణలో చేశామని చెప్పారు. ఈ కేంద్రానికి ఎవరూ రాకుండా కోరుకోవాలని, అతి తక్కువ కేసులు నమోదైతేనే శాంతి భద్రతల్లో పరిరక్షించడంలో ముందుంటామని చెప్పారు.

వారికి ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తించదు: డీజీపీ మహేందర్ రెడ్డి

ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ నేరస్థులకు కాదని, ప్రజలకు దగ్గరై పోలీసింగ్ అంటే భయం లేకుండా చేయడమే దాని ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పోలీసులకు టెక్నాలజీనే వెన్నుముక అని, రాష్ట్రంలో ఇప్పటి వరకూ 9లక్షల సీసీ టీవీలను ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేశామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో నేను సైతం సీసీటీవీ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఇది నిరంతంర ప్రక్రియ అన్నారు. ఎవరైన ప్రమాదంలో ఉంటే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేయాలని, 5నుంచి 10 నిమిషాల్లోనే పోలీసులు వస్తారని చెప్పారు. సమాజంలో 50 శాతం మంది మహిళల భద్రత పోలీస్ శాఖ బాధ్యతేనని సీఎం చెప్పారని, ఆయన ఆలోచనల నుంచే షీ టీమ్స్ దేశంలో మొదటగా మన రాష్ట్రంలో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన, సమర్థవంతమైన సేవలను అందించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకంగా ఉండేలా చర్యలు తీసుకొని మహిళల భద్రత కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా విమేన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల మహిళలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే విధంగా మహిళా స్వయం సహాయక సంఘాలన్నింటినీ భాగస్వామ్యం చేస్తూ మహిళల రక్షణ కోసం షీ టీం పోలీస్ గ్రామీణ స్థాయిలోనూ పని చేసే విధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అదే విధంగా పాఠశాల స్థాయిలో సైతం సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో రాష్ట్ర స్థాయిలో విద్యా శాఖతో కలిసి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గర్ల్ సేఫ్టీ క్లబ్స్ ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి, పోలీసులకు ఎలా ఫిర్యాదు చేయాలో తెలియజేసే విధంగా సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులను సైతం భాగస్వామ్యం చేసి బాలికల రక్షణకు కృషి చేయడంతో పాటు ట్రైన్ ది ట్రైనర్స్ కార్యక్రమాలు నిర్వహించేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు. నేరం జరగకుండా చూడడమే పోలీస్ శాఖ ప్రధమ లక్ష్యంగా తెలంగాణ పోలీస్ పని చేస్తుందని, శాంతి భద్రతలు సమర్ధవంతంగా ఉంటేనే పెట్టుబడులకు అవకాశం, అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed