గొడవపై మంత్రి, ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు.. ఇద్దరి రియాక్షన్ ఇదే!

by Shyam |   ( Updated:2021-07-26 21:39:37.0  )
Minister Jagadish Reddy, MLA Komatireddy
X

దిశ, మునుగోడు: చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం వాడివేడీగా జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఆగ్రహంతో మంత్రి వద్ద నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి మైక్ లాక్కున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అభివృద్ధికి ఆటంకంగా మారారని ఆరోపించారు. రౌడీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా కోమటిరెడ్డి బ్రదర్స్ మారారని, ఇక వాళ్ళ కాలం చెల్లిందని, చిల్లర రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ప్రకటించారు. ప్రతి పేదవాడి కడుపు నింపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆయన అన్నారు.

Minister Jagadish Reddy, MLA Komatireddy

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళ వద్ద మోకరిల్లి బానిస బతుకు బతుకుతున్న మంత్రి జగదీష్ రెడ్డి నల్లగొండ జిల్లా వాసి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుటుంబీకుల నియోజకవర్గాలకు అధిక నిధులు కేటాయిస్తూ.. మిగిలిన జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డికి దమ్ముంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిధులు కేటాయించి అభివృద్ధి జరిగేలా చూడాలని, లేదంటే చౌటుప్పల్ మీదుగా రాకుండా చేస్తామని హెచ్చరించారు. ప్రజలు తిరస్కరించిన వారిని వెంటబెట్టుకుని మంత్రి హంగామా సృష్టిస్తున్నాడని, పదవులు శాశ్వతం కాదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెను నిజామాబాద్‌లో ఓడించారని, త్వరలోనే కేసీఆర్‌కు కూడా గుణపాఠం చెబుతారని తెలిపారు. సీఎం కేసీఆర్ దగాకోరని, కేవలం ఉప ఎన్నిక వచ్చిన నియోజకవర్గాలకే నిధులు కేటాయిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గానికి కూడా రూ. 2 వేల కోట్లు విడుదల చేసి దళిత బంధును అమలుచేయాలని డిమాండ్ చేశారు. దళితబంధుతో పాటు వెనుకబడిన గిరిజన, బీసీల కోసం కూడా కొత్త పథకం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed