ప్రకృతి వ్యవస్థల పునరుద్ధరణతోనే పర్యావరణ పరిరక్షణ: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by Shyam |
ప్రకృతి వ్యవస్థల పునరుద్ధరణతోనే పర్యావరణ పరిరక్షణ: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రకృతి పునరుద్దరణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. కాలుష్య నియంత్రణ మండలి, ఇపిటిఆర్ఐ సంయుక్తంగా వర్చువల్ సమావేశం నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ & ఇపిటిఆర్ఐ డీజీ ఆధార్ సిన్హా, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నీతు ప్రసాద్, ఇపిటిఆర్ఐ కో ఆర్డినేటర్ డాక్టర్.సునీల, తదితరులు పాల్గొన్నారు.

‘ప్రకృతితో ప్రాణులకు విడదీయరాని అవినాభావ‌ సంబంధం ఉంది. మనిషి ప్రకృతిని కాపాడితే అది తిరిగి భూమిపై ఉన్న జీవరాశుల్ని కాపాడుతుంది. ప్ర‌తీ ఏటా మ‌నం జూన్ 5న ఐక్య‌రాజ్య స‌మితి ఆధ్వర్యంలో యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్ఇపి) స‌హ‌కారంతో పర్యావరణ దినోత్సవాన్ని జ‌రుపుకుంటున్నాము. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించి త‌గు చ‌ర్యలు చేప‌ట్టేలా ప్రోత్సహించ‌డ‌మే ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ‌ ముఖ్యోద్దేశం’ అని అన్నారు

‘2020లో ‘టైమ్‌ ఫర్‌ నేచర్‌ థీమ్ కాగా, ఇక ఈ ఏడాది “ప్రకృతిని ఉహించు. సృష్టించు, పునరుద్ధరించు” అనే ఇతివృత్తంతో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని జరుపుకుంటున్నాం. ‘ఎకో సిస్టమ్‌ రిస్టోరేషన్‌’ (పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ) ఈ ద‌శాబ్ధి థీమ్ గా ఐక్య‌రాజ్య స‌మితి నిర్ణ‌యించింది. దీంతో పాటు ప్ర‌కృతితో మాన‌వ సంబంధాల‌ను పునఃస్థాపించడంపై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ పరిరక్షణ, శిక్షణ మరియు పరిశోధన సంస్థ భాగస్వామ్యంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వ‌హిస్తున్నందుకు వారికి అభినంద‌న‌లు’ అని చెప్పారు.

“ప్రకృతిని ఉహించు. సృష్టించు, పునరుద్ధరించు అనే ఈ ఏడాది థీమ్ ల‌క్ష్యాన్ని ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు గారు ఎప్పుడో గుర్తించారు. అభివృద్ధి అనేది ప‌ర్యావ‌ర‌ణహితంగా ఉండాల‌ని భావించిన ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు గారు మ‌న‌కు ఉన్న ప్ర‌కృతి వ‌న‌రుల‌ను కాపాడేందుకు అనేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ, జీవ‌వైవిధ్య సంర‌క్ష‌ణ‌కు అధిక ప్రాధ‌న్య‌త‌నిస్తూ… చేపట్టిన వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. హ‌రిత‌హార కార్య‌క్ర‌మ ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర మంతా మన కళ్లముందు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున మొక్క‌లు నాటి, వాటిని సంరక్షించ‌డం వ‌ల్ల తెలంగాణ‌లో 4% ప‌చ్చ‌ద‌నం పెరిగింది. అట‌వీ ప్రాంత విస్తీర్ణం సైతం వృద్ధి చెందింది. వ‌న్యప్రాణి సంర‌క్ష‌ణ‌లోనూ చ‌క్క‌టి ఫలితాలు సాధించా౦. వ‌న్య‌ప్రాణుల‌ సంతతి కూడా క్ర‌మంగా పెరుగుతోంది’ అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed