మంత్రిగా చేయలేనివి ఎమ్మెల్యేగా చేస్తావా.. ఈటలకు హరీష్ రావు ప్రశ్న

by Sridhar Babu |
Minister Harish Rao
X

దిశ, హుజురాబాద్: ఏడేళ్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు హుజురాబాద్ ఉప ఎన్నికలు రెఫరెండముగా భావించాల్సి ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో అరాచకానికి, అభివృద్ధికి జరుగుతున్న పోటీగా అభివర్ణించారు. ఏడేళ్లలో ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజల నడ్డీ విరుస్తోన్న బీజేపీకి ఓటు వేస్తారో లేక, ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్‌కు వేస్తారో ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. తన రాజీనామా వల్లనే కేసీఆర్ ప్రభుత్వం ‘దళితబంధు’ ప్రవేశ పెట్టిందని తప్పుడు ప్రచారం చేస్తున్న ఈటల, గతంలో ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్ తదితర పథకాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మద్యం, డబ్బులు తీసుకుంటున్నారని ప్రచారం చేస్తూ హుజురాబాద్ ప్రాంత ఓటర్ల ఆత్మగౌరవాన్ని ఈటల మంటగలుపుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల సంక్షేమానికి చేపట్టిన పథకాలేమిటో చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి, ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తావో చెప్పు అని ప్రశ్నించారు. ఈటల దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అభివృద్ధికి పట్టం కట్టేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఓటు వేసి గెలిపించాలని హరీష్ రావు కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed