సిద్దిపేట పట్టణ పారిశుధ్యం మెరుగుపడాలి

by Shyam |   ( Updated:2020-04-12 06:35:18.0  )
సిద్దిపేట పట్టణ పారిశుధ్యం మెరుగుపడాలి
X

దిశ, మెదక్: సిద్దిపేట పట్టణంలో పారిశుధ్యం మరింత మెరుగు పడాలని, ఇంటింటికి తాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా ప్రతిరోజూ సేకరించాలన్నారు. అండర్ గ్రౌండ్, డ్రైనేజీ పనులు, పారిశుధ్యంపై కార్మికుల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. శానిటరీ ఇన్స్పెక్టర్స్ పనితీరులో మార్పు రావాలన్నారు.పట్టణ పరిశుభ్రత పారిశుధ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. సిద్దిపేట పట్టణంలో ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నా పారిశుధ్య పనుల్లో ఇబ్బందులు ఉన్నాయని సీరియస్ అయ్యారు. చెత్తను క్లీన్ చేసే వాహనం పాడై 4నెలల గడిచిన దానిని ఎందుకు బాగు చేయించడం లేదని మండిపడ్డారు. ఇద్దరు ఎస్‌ఐలు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్మికులు బయోమెట్రిక్ పెట్టి వెళ్లిపోతున్నారని, చెత్త సేకరించే వారు కనిపించడం లేదని, ఒక జవాన్ మూడు వార్డులు, స్వీపర్ 2 నుంచి 3గంటలు పని చేయడం, ఎస్‌ఐలు బలహీనంగా ఉండటం వంటి విషయాలు తన దృష్టికి వచ్చాయని మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌కు మంత్రి హరీష్ చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రతాప్ , డీఈ లక్ష్మణ్ , ఓఎస్డీ బాల్ రాజ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, సతీశ్ పాల్గొన్నారు.

tags: corona, municipal workers, do properly, minister harish rao, video conference with siddipet commissioner

Advertisement

Next Story