చిల్లర గాళ్లతో డిస్కస్ చేయం : ఎర్రబెల్లి

by Shyam |   ( Updated:2021-03-03 07:26:37.0  )
చిల్లర గాళ్లతో డిస్కస్ చేయం : ఎర్రబెల్లి
X

దిశ, జనగామ : చిల్లరగాళ్లతో డిస్కస్ చేసే సమయం తమకు లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జనగామకు చేరుకున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వ పరంగా ఉన్న ఆస్తులను ప్రైవేటీకరించడం బాధాకరమన్నారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై చాయ్ అమ్మకున్నానని చెప్పుకునే ప్రధాని రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించడం ప్రజలు గమనించాలన్నారు. ఇకపోతే బండి సంజయ్ పిచ్చికూతలు కూయడం తప్ప ఇంకేం చేయలేడని విమర్శించారు. తమ పార్టీ 80శాతం ప్రభుత్వ హామీలు నెరవెర్చిందని, మిగతా 20శాతం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

తెలంగాణలో అవసరమున్న జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరగా ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. అలాగే వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా నూతన సాగు చట్టాలు తీసుకొచ్చిన కేంద్రానికి పట్టబద్రులు ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు. స్వలాభం కోసం ఎవరు రాజకీయాలు చేస్తున్నారో తమకు తెలుసునని, బీజేపీ మొత్తం మోసగాళ్లు, చిల్లరగాళ్లతో నిండిపోయిందని.. అలాంటివారితో తమకు డిస్కస్ చేసే సమయం లేదన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విఫ్ బొడకుంటి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story