ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్మం వలిచేస్తా- అనిల్ కుమార్

by srinivas |
ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్మం వలిచేస్తా- అనిల్ కుమార్
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ నేతలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు నోరు జారితే చర్మం వలిచేస్తానంటూ గట్టిగా హెచ్చరించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నోరుందికదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు నోటికి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రిని తిడుతూ మళ్లీ మమ్మల్ని బూతుల మంత్రి అని ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ సహనానికి కూడా ఒక స్థాయి ఉంటుందని అది గమనించాలన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి.. బోషడికే అని మాట్లాడితే తాము చేతులకు గాజులు తొడుక్కొని ఉండాలా అని ప్రశ్నించారు.

నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ యలమవారిదిన్నె సింహపురి హాస్పిటల్ సమీపంలోని బలిజపాలెంలో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం అనంతరం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. “నెల్లూరు నగరంలో వరుసగా వారం రోజుల పాటు ఉంటా.. కాన్వాయ్, పోలీస్ బందోబస్తు లేకుండా పక్కన పెడతా. నెల్లూరులో వాగిన ప్రతి ఒక్కరూ ధైర్యం ఉంటే రండి తేల్చుకుందాం. ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు వెళ్లాలంటే ముందు మమ్మల్ని దాటుకుని వెళ్లాలి అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి అంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. సీఎం జగన్ కోసం దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. మీడియాలో ప్రగల్బాలు ఎందుకు.. ఎవరు వస్తారో రండి ..తేల్చుకుందాం అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రాలో ఉండే దమ్ము ధైర్యం లేని చంద్రబాబు, లోకేశ్‌లు నీచ రాజకీయానికి పాల్పడుతున్నారని విమర్శించారు. బుడ్డ బెదిరింపులకు తాము బెదిరిపోమని తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. దేనికైనా తాము సిద్ధంగానే ఉన్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు.

పవన్ పైనా తీవ్ర విమర్శలు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా అనిల్ కుమార్ యాదవ్ విమర్శలదాడి చేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగితే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుందని మాట్లాడుతున్న పవన్ టీడీపీ నేతలు ఉపయోగించే భాష సరియైనదేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ఎలా మాట్లాడాలో టీడీపీ నేతలు నేర్చుకోవాలని మీరే చెప్పాలంటూ పవన్ కల్యాణ్‌కు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు.

Next Story

Most Viewed