మిల్లర్ల మాయ.. ప్రభుత్వ ధాన్యంతోనే వ్యాపారం

by Anukaran |   ( Updated:2021-05-25 10:16:34.0  )
Millers business
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్లు మహా వ్యాపారం సాగిస్తున్నారు. మిల్లర్ల మాయలో పడిన పౌరసరఫరాల శాఖ చేతులెత్తేసి దిక్కులు చూస్తోంది. కస్టం మిల్లింగ్​కు ఇచ్చిన ధాన్యానికి ఇంకా లెక్కలు తేల్చడం లేదు. మొత్తం లక్షా 2 వేల క్వింటాళ్ల బియ్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. మరోవైపు ఎఫ్​సీసీ మాత్రం ఈ ధాన్యం వివరాలు తేల్చాలంటూ ఇప్పటికే మూడుసార్లు లేఖ రాసింది. తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కానీ అధికారులు మాత్రం మిల్లర్లకే మద్దతుగా ఉంటున్నారు. ఎఫ్​సీఐ లేఖలను చెత్తబుట్టల్లో పడేస్తున్నారు.

మీరంటే ప్రేమ..!

రాష్ట్రంలోని మిల్లర్లపై పౌర‌ స‌ర‌ఫరాల‌ శాఖ వ‌ల్లమాలిన ప్రేమ ఒల‌క‌బోస్తున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజ‌న్​లో ప్రభుత్వం 64 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దీన్ని సీఎంఆర్​ కోసం మిల్లర్లకు కేటాయించింది. ప్రస్తుతం యాసంగి సీజన్​ ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరుతున్నాయి. కొన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నారు. కానీ గత వానాకాలం సీజన్​ ధాన్యం తాలుకా క‌స్టమ్ రైస్ మిల్లింగ్ పూర్తి చేయ‌లేదు. దీనిపై పౌర స‌ర‌ఫ‌రాల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం తేటతెల్లమవుతోంది. మరోవైపు ఈటల వ్యవహారంలో యుద్దానికి కాలుదువ్వుతున్న మంత్రి కూడా కస్టం మిల్లింగ్​పై భయపడుతున్నట్లే ఉంటున్నారు. మిల్లర్లతో నిత్యం సమావేశమవుతున్నామంటూ చెప్పుతున్నా గత సీజన్​ సీఎంఆర్​ఎఫ్​పై మాత్రం నోరెత్తడం లేదు. దీంతో మిల్లర్లు కూడా మాకేం భయం లేదన్నట్టుగా ఉంటున్నారు.

రాష్ట్రంలో మొత్తం 2,400 మిల్లులుండగా… అందులో బాయిల్డ్ మిల్లులు సుమారు 940 వ‌ర‌కు ఉన్నాయి. వాస్తవంగా కస్టం మిల్లింగ్​పై మిల్లర్లపై చాలా ఆరోపణలున్నాయి. కెపాసిటీ ప్రకారం మిల్లులను నడుపడం లేదని, నడిపినా ప్రభుత్వానికి తక్కువగా ఇవ్వడం.. ప్రైవేట్​ వ్యాపారానికి ఎక్కువగా ఇవ్వడం చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే ఇటీవల సివిల్​ సప్లై మంత్రి కేవలం రాజకీయాలకే పరిమితం కావడం, ఎప్పుడైనా సమీక్షలు చేసినా కేవలం కరీంనగర్​కు మాత్రమే పరిమితం కావడంతో రాష్ట్రంలో మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది.

లక్ష టన్నుల బియ్యం ఏమయ్యాయి..?

ప్రభుత్వం గ‌‌త సీజ‌న్​లో 64 లక్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని మిల్లర్ల‌కు సీఎంఆర్​కు అప్పగించింది. ప్రభుత్వ గ‌ణాంకాల ప్రకారం 64 ల‌క్షల మెట్రిక్​ టన్నుల ధాన్యానికి 43 ల‌క్షల మెట్రిక్​ ట‌న్నుల బియ్యాన్ని తిరిగి అప్పగించాల్సి ఉంటోంది. కానీ ఇచ్చిన ధాన్యంలో ఇంకా ల‌క్షా 2వేల ట‌న్నుల బియ్యం మిల్లర్ల నుంచి సివిల్​ సప్లైకి రావాల్సి ఉంది. ప్రస్తుతం యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. ఈ సమయంలో మళ్లీ కొత్తగా సీఎంఆర్​కు ధాన్యం తరలిస్తున్నారు. కానీ పాత ధాన్యం లెక్కలు మాత్రం తేల్చడం లేదు.

ప్రభుత్వ ధాన్యంతో వ్యాపారం

ప్రతి సీజన్​లో రైస్​మిల్లర్లు కస్టం మిల్లింగ్​తో వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏటా ఎంతోకొంత బియ్యాన్ని ఇవ్వకుండా దాట వేస్తున్నారు. ఒక సీజన్​లో తక్కువగా ఇవ్వడం, దాన్ని సాగదీస్తున్న నేపథ్యంలోనే కొత్త సీజన్​ రావడం… ఆ ధాన్యం మళ్లీ సీఎంఆర్​కు ఇవ్వడం… పాత లెక్కలు పక్కనేయడం ప్రతిసారి జరుగుతూనే ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అయితే కొంతమంది మిల్లర్లలోనే ఉన్న గ్రూపులతో ఇవి ఫిర్యాదుల వరకూ వెళ్తున్నా… సివిల్​ సప్లై కార్పొరేషన్​లో మాత్రం కొంతమంది అధికారులు మధ్యవర్తిత్వం చేసి వారిని సముదాయిస్తున్నారు. దీంతో అటు వ్యాపారులకు, ఇటు అధికారులకు ధాన్యం లెక్కల్లో కలిసి వస్తోంది. వాస్తవానికి సీఎంఆర్ కోసం మిల్లర్ల‌కు అప్పగించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి నిర్దేశించిన గ‌డువులోగా
మిల్లర్లు తిరిగి అప్పగించాల్సి ఉంటోంది. కానీ ప్రతిఏటా సీజన్​ చివరి వరకూ సాగదీస్తూనే ఉంటున్నారు. సీఎంఆర్​ ధాన్యంతో మిల్లర్లు వ్యాపారం చేస్తున్నారని అన్ని వర్గాల్లోనే తెలిసిందే.

ఇస్తారా… ఇవ్వరా… మూడుసార్లు గడువిచ్చిన ఎఫ్​సీఐ

సీఎంఆర్ నుంచి వ‌చ్చిన బియ్యాన్ని ప్రజాప్రయోజ‌నాల కోసం వినియోగించాల్సి వస్తుండటంతో ఇవన్నీ భారత ఆహార సంస్థ (ఎఫ్​సీఐ) ఆధీనంలో ఉంటున్నాయి. గత సీజన్​లో మొత్తం 64 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యానికి 43 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండ‌గా ఇప్పటికీ 42 ల‌క్షల మెట్రిక్​ టన్నులు మాత్రమే మిల్లర్లు తిరిగిచ్చారు. ఇంకా అధికారిక లెక్కల ప్రకారం లక్షా 2 వేల మెట్రిక్​ టన్నుల బియ్యం కోసం ఎఫ్​సీఐ కొంతకాలంగా లేఖలు రాస్తూనే ఉంది. మూడుసార్లు గడువు పెట్టింది.

గత సీజన్​ బియ్యాన్ని ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు గడువు ఇచ్చి మిగిలిన బియ్యాన్ని ఇవ్వాలంటూ తేల్చి చెప్పింది. కానీ ఈ లేఖలను మిల్లర్లు నిర్లక్ష్యంగా తీసుకున్నారు. దీన్ని పర్యవేక్షించాల్సిన సివిల్​ సప్లై అధికారులు కూడా ఎఫ్​సీఐ నుంచి వచ్చే హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. అటు మిల్లర్లకు కూడా భరోసాగా ఉండటంతో లెక్కకు రాని బియ్యంగానే మారుతున్నాయి. అసలు సీఎంఆర్​ బియ్యంపై సంబంధిత మంత్రి, సివిల్​ సప్లై అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనేది అంతు చిక్కకుండానే మారుతోంది. మిల్లర్లే బెదిరిస్తున్నారా… మిల్లర్ల బెదిరింపులకు మంత్రి, అధికారులు భయ పడుతున్నారంటూ సివిల్​ సప్లై అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. ఇదే భరోసాతో మిల్లర్లు కస్టం మిల్లింగ్​ను ఎగవేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యంతో దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు.

Advertisement

Next Story