ఆ వలస బుడతడికి సూట్‌కేసే పడక

by vinod kumar |   ( Updated:2023-08-18 16:21:59.0  )
ఆ వలస బుడతడికి సూట్‌కేసే పడక
X

లక్నో: వలస కార్మికుల వెతలు తీరడం లేదు. శ్రామిక్ ట్రైన్‌లు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా.. వలస కార్మికుల కాలినడక ఆగడం లేదు. ఈ ప్రయాణంలో కొందరు అర్ధాంతరంగా తనువు చాలిస్తుండగా.. కొందరు కొన ఊపిరితో ఇంటికి ముడుతున్నారు. అంతో ఇంతో ఒంట్లో సత్తువ ఉంటే కొద్దిమేరకైనా ప్రయాణాన్ని అలుపులేకుండా సాగించవచ్చు కానీ, చిన్నారులో.. గర్భిణులో అయితే ఈ ప్రయాణం మరింత కఠినంగా మారుతున్నది. తాజాగా, వందల కిలోమీటర్లు నడవలేక, నిస్సహాయంగా మారిన పిల్లాడిని సూట్‌కేసుపై పడుకోబెట్టి ఓ తల్లి లాక్కెళ్లుతున్న వీడియో వలస కార్మికుల ఇక్కట్లను వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో హైవేపై ఈ దృశ్యం కనిపించింది. పంజాబ్ నుంచి కొందరు వలస కూలీలు సమూహంగా సుమారు 800 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పట్టణానికి బయల్దేరారు. ఆ గుంపులోని ఓ మహిళ తన కుమారుడు అలసి పోవడంతో సూట్‌కేసుపై పడుకోబెట్టి లాక్కెళ్లింది. కాగా, తెలంగాణ నుంచి సుమారు 700 కిలోమీటర్ల దూరాన ఉన్న మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు రాము అనే వలస కార్మికుడు.. కూతురు, గర్భిణీ అయిన తన భార్యతో కలిసి బయల్దేరాడు. కానీ, మార్గమధ్యలోనే భార్య, కూతురు అలసిపోవడంతో.. రోడ్డుపక్కనే దొరికిన కొన్ని కట్టెలతో చిన్నపాటి చక్రాల బండిని తయారు చేశాడు. దానిపై ఇద్దరిని కూర్చోబెట్టి… లాక్కెళ్లాడు. అన్నపానీయాలు లేకుండానే.. అలసటతోనే వందల కిలోమీటర్లను వారిని లాక్కెళ్లాడు. ఓపిక లేని స్థితిలో బాలాఘాట్‌కు చేరగానే.. అధికారులు వారికి ఆహారం అందించి క్వారంటైన్‌లోకి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed