రోడ్డెక్కిన వలస కూలీలు

by Shyam |
రోడ్డెక్కిన వలస కూలీలు
X

దిశ, హైదరాబాద్:
ఓ వైపు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అవసరాల నిమిత్తం ఏ ఒక్కరు బయటకొచ్చినా, అది కొత్త సమస్యకు దారితీస్తుండటంతో.. ఆ పరిస్థితులను చక్కదిద్దలేక ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి లాక్‌డౌన్ మంగళవారంతో ముగియనుండగా, ప్రధానితో సీఎంల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ గడువును ఈ నెల 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. మోడీ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోనూ లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో నగరంలో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉంటున్న వలస కూలీలు ఎలాగైనా తమ సొంతూళ్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నగరంలోని హబ్సిగూడ ప్రాంతానికి వలస కూలీలు పెద్ద ఎత్తున చేరుకాగా.. పోలీసులు వీరి ప్రయాణాన్ని అడ్డుకోవడంతో ధర్నాకు దిగాల్సి వచ్చింది.

పనుల్లేక.. పస్తులుండలేక..

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 22 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. జీవనోపాధి కోసం నగరానికి ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వలసొచ్చిన కూలీలకు పనుల్లేక వారి కుటుంబ పోషణతో పాటు ఇంటి అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వలస కూలీలకు ఇచ్చిన బియ్యం, రూ.500లు కూడా అంతంత మాత్రంగానే అందాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది ఇంటి యజమానులు ఖాళీ చేయాలని చెబుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రవాణా వ్యవస్థ లేకున్నా, ఎలాగైనా సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఏపీ లోని పలు జిల్లాలకు చెందిన కూలీలంతా తమ లగేజీతో బయలుదేరారు. వీరందరినీ హబ్సిగూడ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకోగా ధర్నాకు దిగారు.

రంగంలోకి మంత్రి తలసాని..

వలస కూలీలంతా రోడ్డుపై ధర్నాకు దిగడంతో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు చేసేదేం లేక చేతులెత్తేశారు. ఇలాగైతే, వైరస్ వ్యాపిస్తుందని, మీకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఎంత చెప్పినా వలస కూలీలు వినలేదు. అంతే పట్టుదలతో మా ఊళ్ళకు వెళ్తామని చెప్పారు. ఈ విషయం మీడియాలో రాగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేరుగా ధర్నా ప్రదేశానికి చేరుకున్నాడు. ‘మీ అందరికీ తగిన ఏర్పాట్లు చేస్తానని, అవసరమైతే ఇళ్ళు ఖాళీ చేయకుండా ఇంటి యాజమానులతో మాట్లాడతానని.. లేదంటే ప్రభుత్వ షెల్టర్లలో ఉంచుతానని’ మంత్రి వారికి భరోసా కల్పించారు. మంత్రి తలసాని హామీ మేరకు.. వలస కూలీలను మారేడ్ పల్లికి తరలించారు. ఈ సమయంలో అందరినీ డీసీఎం వాహనాల్లో ఎక్కించిన పోలీసులు, అధికారులు.. సోషల్ డిస్టెన్స్ అంశాన్ని మరిచిపోవడం గమనార్హం.

Tags: Corona Effect, Minister Talasani, Migrant Worker’s Dharna in Habsiguda, GHMC

Advertisement

Next Story

Most Viewed