జిల్లాలో మెడికల్ మాఫియా.. పట్టించుకోని అధికారులు

by Aamani |   ( Updated:2021-05-26 02:05:25.0  )
జిల్లాలో మెడికల్ మాఫియా.. పట్టించుకోని అధికారులు
X

దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ బారిన పడి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే మానవత్వంతో చలించి పోవాల్సింది పోయి.. జిల్లాలోని మెడికల్ షాప్ల యాజమాన్యం కృత్రిమంగా మందుల కొరతను సృష్టిస్తున్నారు. రోగికి అవసరమైన మందులు తమ వద్ద లేవంటూ బయటనుంచి తీసుకువచ్చామని అధిక ధరలకు అమ్ముతున్నారు. మెడికల్ మాఫియాపై అధికారుల దృష్టికి తీసుకువచ్చినా వారు పట్టించుకోకపోవడంతో రోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నది. బంగారం కూడబెట్టి ..పంట చేనులను అమ్మి లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు.

జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలు..

జిల్లాలో రోజురోజుకు కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండగా.. పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. కొంత మంది రోగులకు ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ తో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఇలాంటి వారికి రెమిడిసివర్ ఇంజక్షన్ అవసరం ఉంటుంది. ఈ ఇంజక్షన్ ధర 2,700 ఉంది. మార్కెట్లో డిమాండ్ పెరగగా.. మెడికల్ యాజమాన్యం సిండికేట్గా ఏర్పడి.. మాఫియాగా తయారయింది. ఇంజక్షన్ లకు కృత్రిమంగా కొరత సృష్టించారు. హైదరాబాద్, మహారాష్ట్రలోనే నాగపూర్ల నుంచి తెప్పించమని 25 వేల వరకు అమ్ముతున్నారు.

అలాగే గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర బార్డర్ లోని గ్రామాల్లో బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో రోగులకు తెరిసీన్ బి ఇంజక్షన్ అవసరం ఉంటుంది. దీని ధర 7900 మాత్రమే ఉంది. అయితే మెడికల్ యాజమాన్యం ఈ ఇంజక్షన్ ను 25 నుంచి 30 వేల వరకు విక్రయిస్తున్నారు. గత్యంతరం లేక రోగుల అటెండెంట్ లు ఇంజెక్షన్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయమై వైద్యారోగ్యశాఖ, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్, జిల్లా ఉన్నత అధికారులకు తెలిసినా కూడా వారు పట్టించుకోవడం లేదు.

రోగుల పై తీవ్ర ఆర్థిక భారం..

కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్రలో మొదట విజృంభించింది. జిల్లా నలుమూలల బార్డర్ ఉండడంతో ముందుగా సమీప గ్రామాలకు ఈ వైరస్ సోకింది. ఆ తర్వాత క్రమక్రమంగా.. పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని గ్రామాలకు వైరస్ విస్తరించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు సరిపోకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం పది పడకల ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కరోనా వైరస్ కు చికిత్సలు అందించాలని సూచించింది. ఇదే అదునుగా చేసుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. చేసేదేమి లేక రోగులు చేన్లు, ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదువబెట్టి బిల్లులు చెల్లిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై, మెడికల్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు.

Advertisement

Next Story