లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తేస్తే కరోనా విస్ఫోటనమే !

by Shyam |
లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తేస్తే కరోనా విస్ఫోటనమే !
X

వైద్యారోగ్య సిబ్బందికి ఇన్‌ఫెక్షన్ ప్రమాదం
ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు

దిశ, న్యూస్ బ్యూరో :

మూడో విడత లాక్‌డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షల్ని సడలించినా.. రాష్ట్రప్రభుత్వం మాత్రం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. కొన్ని ఆంక్షల్ని సడలించే అనివార్య పరిస్థితులు ఏర్పడటంతో వైరస్ వ్యాప్తిపై వైద్యారోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒక్కసారిగా ఆంక్షల్ని తొలగించడం సమంజసం కాదని, లాక్‌డౌన్ ఎత్తేయాల్సి వచ్చినా దానికి దశలవారీ సడలింపుల విధానాన్ని అవలంబించడమే మంచిదని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే నాలుగు రోజుల్లోనే కేసులు రెట్టింపవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి ఇన్‌ఫెక్షన్ ప్రమాదం పొంచి ఉందని, ఇప్పటికే 34 మంది చిక్కుల్లో ఉన్నారని పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపైన వైద్య సిబ్బందికి షిఫ్ట్‌లవారీ రొటీన్ వర్క్ చార్ట్ తయారుచేస్తున్నామని, తరచూ వారికి పరీక్షలు నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.

మూడో విడత లాక్‌డౌన్‌లో నిబంధనల సడలింపుపై రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతున్న సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఒక నివేదికను రూపొందించింది. ప్రస్తుత పరిస్థితి, త్వరలో సడలింపులకు ఉన్న అవకాశాలు, దాని ద్వారా వచ్చే ప్రమాదం, ఇకపైన తీసుకోవాల్సిన చర్యలు, లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయాల్సి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను ఆ నివేదికలో ప్రస్తావించింది. రాష్ట్రంలో మార్చి 2వ తేదీన తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా, తొమ్మిది వారాల తర్వాత 1082 కేసులకు వైరస్ తీవ్రత పెరిగిందని వెల్లడించింది. ప్రస్తుతం 21 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాని జిల్లాలు పది ఉన్నాయని నివేదికలో ప్రస్తావించింది. కానీ అన్నింటికంటే ఎక్కువగా జీహెచ్ఎంసీ కరోనా వైరస్ తీవ్రతను ఎదుర్కొంటున్నదని.. ఇక్కడ జన సాంద్రత, కేసుల నమోదు, ప్రజా కదలికలు ఎక్కువగా ఉండటంతో పాటు సన్నిహితంగా మెలుగుతుండటాన్ని వైద్యారోగ్య శాఖ కారణాలుగా పేర్కొంది. అంతేకాకుండా లాక్‌డౌన్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా ఎత్తేయాల్సి వచ్చినప్పుడు ఆంక్షలు కొనసాగడం తప్పనిసరి అని నొక్కిచెప్పింది.

ఆంక్షలు లేకుంటే కథ మళ్ళీ మొదటికే..

లాక్‌డౌన్‌కు ముందు (మార్చి 2 నుంచి 22 వరకు) కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి మూడున్నర రోజుల సమయం పట్టిందని, తొలి విడత లాక్‌డౌన్‌లో (మార్చి 23 నుంచి ఏప్రిల్ 6 వరకు) 14 రోజుల వ్యవధిలో నాలుగు రోజులకు పెరిగిందని గుర్తుచేశారు. రెండో విడత లాక్‌డౌన్‌లో (ఏప్రిల్ 4 నుంచి మే 3 వరకు) 26 రోజుల వ్యవధిలో చాలా మంది ఫలితాలు వచ్చాయని, అందుకే కేసులు రెట్టింపు కావడానికి 21.6 రోజుల వ్యవధి పట్టిందన్నారు. ఇప్పుడు ఆంక్షలేవీ లేకుండా లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే నాలుగు రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. జీహెచ్ఎంసీ కంటే మిగిలిన ప్రాంతాలు కాస్త మెరుగ్గా ఉన్నాయని, అందుకే ఏప్రిల్ 7 నుంచి మే 3వ తేదీ వరకు కేసులు రెట్టింపు కావడానికి 79 రోజుల సమయం పడుతోందని వారు గుర్తుచేశారు.

ఇప్పుడేం చేయాలి?

ఇప్పటిదాకా వ్యవహరించిన లాక్‌డౌన్ విధానంతో మంచి ఫలితాలే ఉన్నా, దీర్ఘకాలం ఇదే పరిస్థితిని కొనసాగించలేని పరిస్థితుల్లో కొన్ని ఆంక్షలు సడలించడం అనివార్యమైందని పేర్కొన్న వైద్యారోగ్య శాఖ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. తక్షణం వైద్యారోగ్య సిబ్బంది (డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్, ఆయాలు.. తదితరులు)ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముందని నొక్కిచెప్పింది. వైరస్ వ్యాప్తి నివారణ కోసం మర్కజ్ యాత్రకు వెళ్ళివచ్చినవారితో ఏ రకంగానైనా కాంటాక్టులో ఉన్న వారందరిపైనా నిఘా ఉండాలని పేర్కొంది. ఇక వృద్ధులు, పిల్లలు, పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిపైనా నిరంతర పరిశీలన ఉండాలని చెప్పింది. ఇందుకోసం తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, కరోనా పేషెంట్లు ఉన్నవార్డుల్లో వైద్య సిబ్బందికి షిప్టులవారీగా డ్యూటీలను అమలుచేస్తూ ప్రత్యేక చార్ట్ తయారుచేయాలని సూచించింది. ఇప్పటిదాకా ఆ వార్డుల్లో ట్రీట్‌మెంట్ ఇచ్చిన నర్సుల స్థానంలో కొత్తగా నర్సులను నియమించాల్సి ఉంటుంది. కాబట్టి వారికి కరోనా పేషెంట్లకు ఇవ్వాల్సిన చికిత్సపై ఓరియంటేషన్‌తో పాటు శిక్షణనివ్వడమూ తప్పనిసరి అని పేర్కొంది. అవసరానికి తగినట్లుగా పీపీఈ కిట్లను సమకూర్చుకోవాలని చెప్పింది.

ఒకే ఆస్పత్రి లేదా వార్డుపై భారం వేయకుండా కేసులను వివిధ ఆస్పత్రులకు వికేంద్రీకరించడం ద్వారా వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గుతుందని సూచించింది. దీనికి తోడు ప్రతీ జిల్లా కేంద్రంలో కరోనా పేషెంట్లకు చికిత్స చేసేలా ఒక ఆస్పత్రి ఉండాలంది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి మాత్రమే పూర్తిస్థాయిలో కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నందున.. ఇకపైన జిల్లాల్లోనూ ఈ సౌకర్యాలు ఉండాలని సూచించింది. ఇందుకోసం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో తీవ్రమైన ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాధపడుతున్నవారి వివరాలను జిల్లా అధికారులు సేకరించాలని తెలిపింది. గ్రామ స్థాయి నుంచి ప్రైవేటు మెడికల్ ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లు, మెడికల్ షాపులు, సంప్రదాయ వైద్యం చేస్తున్నవారు తదితరులపై నిఘా అవసరమంది. చికిత్సా విధానం ఒకే తరహాలో ఉండేందుకు త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని, లేదంటే వ్యాధి తీవ్రత పెరిగడంతో పాటు రోగనిరోధక శక్తి తగ్గి కరోనా బారిన పడే ప్రమాదముందని హెచ్చరించింది.

వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరగడానికి ఆస్కారమున్న సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, స్విమ్మింగ్ పూల్స్ తదితర జనం గుమిగూడే ప్రాంతాలను ఇంకా నిషేధంలోనే ఉంచాలని నొక్కిచెప్పింది. కేవలం నిత్యావసరాలు, అత్యవసర పనులకు మాత్రమే ప్రజలు బయటకు వచ్చేలా నిబంధనలు కొనసాగించాలని చెప్పింది. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వీలైనంతవరకు టెలీ మెడిసిన్ విధానం ద్వారా డాక్టర్లను సంప్రదించాలని, తప్పనిసరైతే మాత్రమే ఆస్పత్రులకు వెళ్ళాలని సూచించింది. మంత్రివర్గం సమావేశమై ఆంక్షలను సడలించడపై చర్చ జరుగుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ నివేదికను పరిశీలన కోసం పంపింది.

Tags: Telangana, LockDown, Restrictions, Relaxations, Public Health Department, Report, Phased-wise

Advertisement

Next Story

Most Viewed