సీఎం దత్తత గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

by Shyam |
సీఎం దత్తత గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష
X

దిశ, హైదరాబాద్: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధి పనులపై కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు శనివారం సమీక్షించారు. జిల్లాలోని లక్ష్మాపూర్, కేశవరం, ఎంసీ పల్లి, నాగిశెట్టిపల్లి, లింగాపూర్ తండా గ్రామాలలో పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్,
మార్కెటింగ్, వ్యవసాయ శాఖ తదితర అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా దత్తత గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న వైకుంఠధామం, కమ్యూనిటీ హాల్, డంపింగ్ యార్డ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఈఈని ఆదేశించారు.రహదారులకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులకు సూచించారు.

లక్ష్మాపూర్‌లో మార్కెట్ భవన నిర్మాణం అసంపూర్తిగా ఉన్నందున వెంటనే పూర్తి చేయాలన్నారు. చెరువుల మరమ్మతులను పూర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు వాడుకలో ఉన్నాయో.. లేదో తనిఖీల ద్వారా పరిశీలించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. డ్వాక్రా మహిళలకు బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో కొత్తగా నిర్మించే ఇండ్లకు తప్పనిసరిగా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. లక్ష్మాపూర్, కేశవరం, ఎం‌సి పల్లి, నాగిశెట్టిపల్లి, లింగాపూర్ తండా గ్రామాల్లో హరిత హారంలో భాగంగా నర్సరీలలో నాటిన మొక్కలు తప్పనిసరిగా 85 శాతం సంరక్షించడానికి కృషి చేయాలన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో వేరొక మొక్కను నాటి సంరక్షించాలని అధికారులకు హితవు పలికారు. గతవారం సందర్శనలో నర్సరీలలో పెంచే మొక్కలు ఏమాత్రం బాగోలేవని చెప్పడం జరిగిందన్నారు. మరోసారి ఆకస్మికంగా తనిఖీ చేసే సమయంలో మొక్కల సంరక్షణపై తగు జాగ్రత్తలు తీసుకొని యెడల కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విద్యాసాగర్, సీపీవో సౌమ్య, పంచాయతీ రాజ్ ఈఈ రామ్మోహన్, ఆర్‌అండ్‌బి అధికారులు చందర్ సింగ్, మంజుల, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, వ్యవసాయ శాఖ అధికారి మేరీ రేఖ పాల్గొన్నారు.

Tags: collector review, development works, cm adopted villages, facilities, enquired

Advertisement

Next Story