అవి తప్పుడు లెక్కలు.. అసలు కరోనా కంట్రోల్లో లేదంట

by Anukaran |
అవి తప్పుడు లెక్కలు.. అసలు కరోనా కంట్రోల్లో లేదంట
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దేశంలో రోజు రోజుకూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు కరోనా విషయంలో ఏం జరుగుతోంది. జిల్లాల్లో కేసులు పెరగడానికి కారణాలేమిటీ..? వైరస్ ను కట్టడి చేయడంలో జిల్లా అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారా..? ఏఏ జిల్లాల్లో అధికార యంత్రాంగం విఫలమైందనే విషయమై కేంద్రం సర్వే చేపట్టింది. ఇందులో దేశంలో 16 జిల్లాలు కరోనాకు హాట్ స్పాట్ ప్రాంతాలుగా, వైరస్ ను కంట్రోల్ చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైనట్లు గుర్తించింది. వీటిలో మన రాష్ట్రం నుంచి హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు సైతం ఉన్నట్లు తెల్సింది. ఈ రెండు జిల్లాల్లో రోజుకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నా.. కొవిడ్ ను కంట్రోల్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కరోనా కల్లోలం..

తెలంగాణలో ముందు నుంచి హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తోంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ సడలింపుతో శివారు జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డికి వైరస్​శరవేగంగా వ్యాపించింది. ఇప్పటికి ఈ జిల్లాల్లో రోజువారీగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో సగానికిపైగా ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులంతా ఇక్కడే ఉన్నా.. కరోనాను కట్టడిలో విఫలమవుతున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత సర్కారు పట్టించుకోకపోవడం.., జనం విపరీతంగా రోడ్లపైకి రావడంతో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని గ్రేటర్ పరిధిలో కేసులు సంఖ్య జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నది. మేడ్చల్ లో విఫలం..

దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చేయని జిల్లాల్లో మేడ్చల్ జిల్లా పూర్తిగా విఫలమైనట్లు కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలో 47,807 శాంపిల్స్ సేకరించగా, 13,894 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. రోజువారీ టెస్టుల సంఖ్యను మరింత పెంచి వైరస్ వ్యాప్తిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందం అధికార యంత్రాంగాన్ని అదేశించినట్లు సమాచారం. జిల్లాలో కరోనా కేసులను వెల్లడించడంలోనూ జిల్లా వైద్యారోగ్య శాఖ యంత్రాంగం గోప్యతను పాటిస్తుంది. కరోనా కేసులు ఏఏ ప్రాంతంలో ఉన్నాయో తెలియజేసి, ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ విఫలమైంది. రోజుకు 400లకు పైగా ఇక్కడ కేసులు నమోదైతే.. కేవలం రెండు వందల్లోపే కేసులు ఉన్నట్లు జనాన్ని మభ్యపెడుతోంది.

టెస్టులు నిల్.. కేసులు ఫుల్

కరోనా గైడ్ లైన్స్ పాటించడంలో మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కేంద్ర గుర్తించింది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు, టెస్టుల నిర్వహణ ఈ రెండు జిల్లాల్లో అధ్వాన్నంగా ఉన్నట్లు తేల్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక జనాభా ఉన్నప్పటికీ టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని, మేడ్చల్ జిల్లాలోని జీహెచ్ఎంసీ ప్రాంతంలోనూ టెస్టులు తక్కువగా.., పాజిటివ్ రేటు ఎక్కువగా ఉందని, టెస్టుల సంఖ్యను పెంచి, కరోనాను కంట్రోల్​ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఏదిఏమైనా మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆది నుంచి టెస్టులు, కరోనా కేసులపై అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story