ఆదివాసీలను మావోయిస్టులు వేధిస్తున్నారు.. ఎస్పీ సునీత్ దత్ ప్రకటన

by Sridhar Babu |   ( Updated:2021-12-07 06:38:43.0  )
ఆదివాసీలను మావోయిస్టులు వేధిస్తున్నారు.. ఎస్పీ సునీత్ దత్ ప్రకటన
X

దిశ, భద్రాచలం: అటవీప్రాంత ఆదివాసీలను భయపెట్టి లొంగదీసుకొని వారితో రకరకాల పనులు చేయిస్తున్న మావోయిస్టులు… మాటవినకపోతే వేధింపులకు గురిచేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్ ఆరోపించారు. ఆ మేరకు ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ కార్యకలాపాల పట్ల ఏజెన్సీ గ్రామాల ఆదివాసీ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసే మీటింగ్‌కు బియ్యం, కూరగాయలతో పాటు ఒక్కొక్కరు రూ.50 – 100 తీసుకురావాలని ఆదేశాలు జారీ చేస్తూ వారిని వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఎదురుదెబ్బలతో మావోయిస్టు పార్టీ మనుగడ కోల్పోతోందని తెలిపారు.

మావోయిస్టు పార్టీ అసాంఘిక కార్యకలాపాల పట్ల ఏజెన్సీ ప్రాంత యువకులు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మైనర్ బాల,బాలికలను ప్రలోభాలకు గురిచేస్తూ బలవంతంగా పార్టీలోకి తీసుకెళుతున్నారని ఆరోపించారు. బాలల హక్కులను నిషేధిత మావోయిస్టు కాలరాస్తోందని పేర్కొన్నారు. అగ్రనాయకుల మరణాలతో అయోమయంలో పడిన మావోయిస్టు పార్టీ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారిందని తెలిపారు. మావోయిస్టు పార్టీలోని నాయకుల వేధింపులు తట్టుకోలేక ఈ ఏడాది ఇప్పటివరకు 110 మంది మిలీషియా, దళ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. రకరకాల జబ్బులతో వారి ప్రాణాలనే కాపాడుకోలేని మావోయిస్టు పార్టీ నాయకులు.. ప్రజలకు ఏవిధంగా మేలు చేస్తారో ప్రజలే ఆలోచించాలని తెలిపారు. ప్రజల మద్దతు పూర్తిగా లభించక మావోయిస్టు పార్టీ మరింతగా బలహీనపడుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed