ఆల్ టైమ్ రికార్డు.. అప్పుల తెలంగాణకు సరిలేరెవ్వరు..!

by Shyam |
ఆల్ టైమ్ రికార్డు.. అప్పుల తెలంగాణకు సరిలేరెవ్వరు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అప్పులు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైం రికార్డును సొంతం చేసుకున్నది. మార్చి 31, 2015 వరకు బహిరంగ మార్కెట్లో అప్పు బకాయి రూ. 56,399 కోట్లు ఉంటే, తాజా బడ్జెట్ అంచనాల ప్రకారం 1,87,606 కోట్లకు చేరింది. కరోనా విజృంభించిన ఈ 11 నెలల వ్యవధిలోనే 41,533 కోట్ల రుణాన్ని ప్రభుత్వం తీసుకున్నది. పాత అప్పలు, కొత్త అప్పులకు కలిపి వడ్డీల చెల్లింపు, పాత అప్పులను తీర్చడం ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వానికి భారమే. కరోనా సమయంలో తీసుకున్న అప్పులన్నీ రానున్న ప్రభుత్వాలకు భారంగా పరిణమించనున్నాయి. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రకటించే హామీల అమలుకు అయ్యే ఖర్చు మోయలేని భారంగా మారింది.

సుదీర్ఘ కాలపు ప్రణాళికతో

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొన్న ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునే రుణాలు, స్వయంప్రతిపత్తి సంస్థల నుంచి తీసుకునే అప్పులు, స్పెషల్ సెక్యూరిటీస్, స్మాల్ సేవింగ్స్ తదితర అప్పులు జీఎస్‌డీపీలో 20.74% ఉంటుందని అంచనా వేసింది. రానున్న ఐదేళ్లకాలాన్ని పరిగణనలోకి తీసుకున్న 15వ ఆర్థిక సంఘం మాత్రం 2026 సంవత్సరానికి అది 29%కి చేరుకుంటుందని అంచనా వేసింది. పాత అప్పులను తీర్చిన తర్వాత కూడా 22.9% మేర రుణభారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది తీసుకున్న అప్పులలో ఎక్కువ భాగం 2040 సంవత్సరం తర్వాత తీర్చేలా సమకూర్చుకున్నవే. రీపేమెంట్‌ను 2050వ సంవత్సరంగా కుదుర్చుకుంది. అంటే దాదాపు 20, 30 సంవత్సరాలపాటు వడ్డీలు కట్టాల్సిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ. 14 వేల కోట్లను చెల్లిస్తోందని పలు సందర్భాలలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మొత్తం జీఎస్‌డీపీలో ఇది దాదాపు 1.3%గా ఉన్నట్లు 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది.

రానున్న కాలంలో గుదిబండే

పాత, కొత్త అప్పులకు కలిపి వడ్డీల చెల్లింపు, పాత అప్పులను తీర్చడం ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వానికి భారమే. కరోనా సమయంలో తీసుకున్న అప్పులన్నీ రానున్న ప్రభుత్వాలకు భారంగా పరిణమించనున్నాయి. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రకటించే హామీల అమలుకు అయ్యే ఖర్చు మోయలేని భారంగా మారింది. సంక్షేమ పథకాలకు తోడు, నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ, ‘ఆసరా’ పింఛన్ల లబ్ధిదారుల అర్హతా వయసును 57 సంవత్సరాలకు కుదించడం, ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్ వీటన్నింటికీ అదనంగా బడ్జెట్ అవసరమవుతుంది. శక్తికి మించిన హామీలను ఇవ్వడం, కరోనా పరిస్థితి అదనపు ఆర్థిక చిక్కులను తీసుకురావడంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది.

కరోనా తెచ్చిన చేటు

కరోనా కారణంగా స్వీయ ఆర్థిక వనరులు బాగా తగ్గిపోవడంతో ప్రభుత్వం అప్పులపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించినట్లుగా ‘హెలికాప్టర్ మనీ’, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందకపోవడంతో అనివార్యంగా అప్పులే గతి అయింది. ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో ఉత్తమ ఫలితాలు సాధించిందని, ఆర్థిక వృద్ధి రేటు చాలా రాష్ట్రాలకంటే ఉత్తమంగా ఉందని, మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా అవతరించిందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. చివరికి నాలుగైదు నెలల లాక్‌డౌన్‌తో అప్పులలో కూరుకుపోయింది. జీఎస్‌డీపీలో దాదాపు సగానికిపైగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల నుంచే సమకూరుతున్నట్లు ఆర్థిక సంఘం గుర్తుచేసింది. ఇప్పటివరకూ రెవెన్యూ లోటు పరిహారం కింద కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందాల్సిన అవసరం లేని తెలంగాణ ఇకపైన ఆ జాబితాలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. జీఎస్టీ విషయంలోనూ ఇప్పటివరకూ పరిహారాన్ని అందుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. ఈసారి మాత్రం అనివార్యమైంది.

ఈ ఏడాది తీసుకున్న ఓపెన్ మార్కెట్ లోన్స్ (కోట్లలో)

ఏప్రిల్ – 4000
మే – 4000
జూన్ – 4461
జూలై – 3000
ఆగస్టు – 3000
సెప్టెంబరు – 4500
అక్టోబరు – 3000
నవంబరు – 3572
డిసెంబరు – 7000
జనవరి-2021 3000
ఫిబ్రవరి (16 వరకు) 2000

Advertisement

Next Story

Most Viewed