మావోయిస్ట్ పార్టీ లేఖ రిలీజ్.. వారి వెనక ఉంది పోలీసులే ?

by Sridhar Babu |
Maoist party
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: తమపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మావోయిస్ట్ పార్టీ లేఖను విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి జిల్లాల పోలీసులు మావోయిస్టు పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ముఖ్యంగా కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ తమ పార్టీపై పనికట్టుకొని అసత్య ప్రచారాలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి పేరిట లేఖ విడుదల చేసింది. ప్రజలను వేధిస్తున్నట్లు, వ్యాపారులను డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని లేఖలో పేర్కొన్నారు.

ఏనాడూ వ్యాపారుల‌ను డబ్బు కోసం వేధించలేదని, డబ్బుల కోసం హత్యలు, బెదిరింపులు పార్టీ చరిత్రలో లేవని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ పేరు చెప్పి బెదిరింపులకు దిగితే ప్రజలే శిక్షించాలని కోరుతున్నామని, అలాంటి వ్యక్తులను పార్టీ ఎప్పుడూ క్షమించదన్నారు. ఈ మధ్యకాలంలో మావోయిస్టు పార్టీని అబాసుపాలు చేసేందుకు పోలీసులు కొన్ని శక్తులను పెంచిపోశించి వారి ద్వారా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. నకిలీ సృష్టి కర్తలు పోలీసులేనని, ఇలాంటి వారి పట్ల ప్రజలు, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని మావోయిస్టు పార్టీ లేఖలో కోరింది.

బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు..

మరోపక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో వ్యూహాత్మకంగా ‘సమాధాన ప్రహార్’ దాడిలో భాగంగా పార్టీపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టి ప్రజలను పార్టీకి దూరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా తమపై బురద జల్లేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలెప్పుడూ అమాయకులు కారన్న విషయం పోలీసులు గమనించాలని పేర్కొన్నారు. పార్టీ ప్రజల కోసం నిరంతరం అహర్నిశలూ పనిచేస్తుందని, ప్రజల జీవన విధానమే తన జీవన విధానంగా కొనసాగుతోందన్నారు.

కాయకష్టం చేసి జీవనం సాగిస్తున్న ఆదివాసీ ప్రజలను అడవి నుంచి గెంటివేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎత్తుగడలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. ప్రజా ప్రతిఘటన చూసిన రాజ్యం తన పోలీసుల ద్వారా మావోయిస్టు పార్టీపై తప్పుడు ఆరోపణలు, నిరాధారమైన నిందలు మోపుతూ, పార్టీకి సహకరిస్తున్న ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చిత్రహింసలకు గురి చేస్తూ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు. పోలీసులు అబద్ధపు ప్రచారాలను ప్రజలెవరూ నమ్మొద్దని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed