మావోయిస్టుల కొత్త ఎత్తుగడ.. ఇరకాటంలో పోలీసులు

by Anukaran |   ( Updated:2020-12-04 00:08:43.0  )
మావోయిస్టుల కొత్త ఎత్తుగడ.. ఇరకాటంలో పోలీసులు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) ఆవిర్భావంతో పాటు, కొయ్యూరు అమవీరులను స్మరించుకునేందుకు మావోయిస్టులు ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. రెండు దశాబ్దాలు అయినందున ఈ సారి పీఎల్జీఏ ఎస్టాబ్లిష్ మెంట్ ఈయర్ గా ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ కమిటీ ఇచ్చిన ప్రెస్ నోట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. 2021 డిసెంబర్ వరకు మావోయిస్టు పార్టీ ఈ కార్యక్రమాలు కొనసాగించనున్నట్టు పేర్కొన్నారు.

ఏడాది పాటు తప్పదా..?

మావోయిస్టు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వివిధ రాష్ట్రాల పోలీసులు ఏడాది పాటు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని స్పష్టం అవుతోంది. ఏటా నిర్వహించినట్టుగానే ఈ సారి కూడా వారోత్సవాలు నిర్వహించుకుంటారని భావించినప్పటికీ పార్టీ తెలంగాణ కమిటీ ఇచ్చిన స్టేట్ మెంట్ ను బట్టి వన్ ఈయర్ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు స్పష్టం అవుతోంది.

టార్గెట్ కోసమేనా..?

మావోయిస్టు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం టార్గెట్ రీచ్ అయ్యేందుకేనని తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో పార్టీ పునర్ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కొయ్యూరు అమరవీరులను స్మరిస్తూ ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే లాభిస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఇరుగు పొరుగు రాష్ట్రాల కేడర్ కూడా సరిహద్దుల్లో కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంటుందని, దీనివల్ల ఎక్కడి బలగాలు అక్కడి ప్రాంతాల్లోనే నిఘా వేస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల జాయింట్ ఆపరేషన్లకు కొంత గ్యాప్ ఏర్పడుతుందని, ఈ సమయంలో ఉత్తర తెలంగాణలో ఏదో ఒక చోట దళాలు పట్టు బిగిస్తే ఇతర ప్రాంతాలకు విస్తరించవచ్చని భావిస్తున్నారని సమాచారం.

డాటా ఫుల్..?

గత వైభవం కోసం తహతహలాడుతున్న మావోయిస్టు పార్టీ ఇప్పటికే పరివాహక ప్రాంతమైన ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించిన వివరాలు పెద్ద ఎత్తున సేకరించినట్టు తెలుస్తోంది. ఎర్ర జెండాలు పాతిన భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన వారి వివరాలు, దళితులు, నిరుపేదలు సేద్యం చేసుకుంటున్న భూములను పట్టాదారు పేరు మార్పిడి చేసుకున్న వారి వివరాలు పూర్తి స్థాయిలో సేకరించినట్టు ప్రచారం జరుగుతోంది. కొంతమందికి మావోలు ఈ మేరకు లేఖలు కూడా పంపించినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే దాదాపు మూడేళ్ల క్రితం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ ప్రత్యేక నివేదికలు తయారు చేసుకుంది. గతంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ మాఫియాకు లేఖలు కూడా పంపిన మావోలు అప్పుడే వారిని హతం చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో కూలీలుగా వచ్చిన మావోయిస్టులు టార్గెట్ ను హతం చేసేందుకు రెక్కి వేసినప్పటకీ ఆ ప్రాంతలో మోహరించిన పోలీసు బలగాల కారణంగా వెనకడుగు వేశారు. ఓ సారి అధికారపార్టీకి చెందిన ఓ నాయకుని ఇంటికి వెళ్లి టార్గెట్ కంప్లీట్ చేయాలనుకున్న క్రమంలో సదరు నాయకుడు ఇంట్లో లేకపోవడంతో సేప్ అయ్యాడు. వీరితో పాటు కలప స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారి చిట్టాను కూడా తయారు చేసుకున్న మావోలు, అధికార పార్టీ నాయకుల వివరాలు కూడా సేకరించారని సమాచారం. పీఎల్జీఏ సంస్మరణ సంవత్సరంగా ప్రకటించుకున్న ఈ ఏడాదిలో కొన్ని లక్ష్యాలను ఛేదించినట్టయితే పార్టీ వైపు ఆకర్షితులు అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని మావో నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సాయుధ దళాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని కూడా అంచనా వేస్తోంది. మావోయిస్టు పార్టీ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఉన్న కారణాలు గుర్తించిన నిఘా వర్గాలు పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed