ఓటమి విజయానికి పునాది: మణుగూరు ఏఎస్పీ

by Sridhar Babu |   ( Updated:2021-12-11 23:07:37.0  )
asp
X

దిశ, అశ్వాపురం: క్రీడలు యువతలో స్నేహ భావాన్ని పెంపొందించడమేకాక మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని మణుగూరు ఏఎస్పీ డా. శభరీష్ అన్నారు. అశ్వాపురం పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని గొందిగూడెం ఆశ్రమ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ క్రీడల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు షీల్డ్, ప్రైజ్ మనీని ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. ఓటమి వల్ల నిరుత్సాహ పడొద్దని.. ఓటమి అనేది గెలుపునకు పునాది అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మండలం నుండి పలు గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులను ఆయన అభినందించారు. ప్రథమ బహుమతి పొందిన బండ్లవారి గుంపు గ్రామానికి చెందిన యువకులకు రూ. 5000 నగదుతోపాటు ప్రోత్సాహక బహుమతి షీల్డ్, ద్వితీయ బహుమతి పొందినటువంటి గొందిగుడెం యువకులకు రూ. 4000 నగదు, షీల్డ్, తృతీయ బహుమతి పొందిన అమగరిపల్లి గ్రామానికి చెందిన యువతకు రూ.3000 నగదు, షీల్డ్, వాలీబాల్ క్రీడలో పాల్గొన్న క్రీడాకారులకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం సీఐ సిహెచ్. శ్రీనివాసరావు, ఎస్ఐ రాజేష్, గొండిగూడెం, గొండిగూడెం కొత్తూరు, ఎలకల గూడెం సర్పంచులు పాయం భద్రమ్మ, పర్షిక సూరిబాబు, కలెటి నర్సింహారావు, పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు, పీఈటీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Next Story