నవంబర్‌లో 10 నెలల గరిష్ఠ స్థాయికి తయారీ కార్యకలాపాలు!

by Harish |
business
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది భారత తయారీ కార్యకలాపాలు 10 నెలల గరిష్ఠంతో అత్యంత వేగంగా వృద్ధి చెందాయి. డిమాండ్ బలోపేతం కావడం, నియామక కార్యకలాపాలు మెరుగుపడటంతో సమీక్షించిన నెలకు సంబంధించి మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ(పీఎంఐ) 57.6కి పెరిగింది. ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ ప్రకారం.. అంతకుముందు నెలలో పీఎంఐ 55.9గా నమోదైంది. పీఎంఐ సూచీ 50 కంటే ఎక్కువ నమోదైతే వృద్ధిగా, అంతకంటే తక్కువగా ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. వరుసగా మూడు నెలల పాటు సన్నగిల్లిన నియామక కార్యకలాపాలు కూడా నవంబర్‌లో మెరుగుపడ్డాయి.

అయితే సరఫరా-డిమాండ్ అసమతుల్యత, పెరిగిన రవాణా ఖర్చుల కారణంగా అక్టోబర్ గరిష్ఠ స్థాయి నుంచి కొనుగోలు ధరల ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గిందని ఐహెచ్ఎస్ మార్కిట్ తెలిపింది. డిమాండ్ పుంజుకున్న నేపథ్యంలో కంపెనీలు నవంబర్‌లో ఉత్పత్తి వాల్యూమ్‌లను పెంచాయి. తద్వారా తొమ్మిది నెలల్లో అత్యంత వేగంగా ఉత్పత్తి పెరిగింది. ‘డిమాండ్‌ను బలోపేతం చేయడం, మార్కెట్ పరిస్థితులను మెరుగుపరచడం, విజయవంతమైన మార్కెటింగ్ నవంబర్‌లో అమ్మకాల పెరుగుదలకు కారణమని తయారీదారులు చెబుతున్నారు. ఫ్యాక్టరీ ఆర్డర్లు వరుసగా ఐదో నెలలో పెరిగాయి. ఫిబ్రవరి నుంచి ఇది అత్యంత వేగవేంతంగా ఉందని’ ఐహెచ్‌ఎస్‌ ఎకనమిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పోలియానా డీ లిమా వెల్లడించారు.

Advertisement

Next Story