- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదెక్కడి ‘గోస’.. కళ్లముందే ‘కాళేశ్వరం’ జలాలు.. ‘ఎవుసానికి’ చుక్క రాదాయే!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కాళేశ్వం ప్రాజెక్టుతో రాష్ట్ర వ్యాప్తంగా జలకళ సంతరించుకున్నా దీపం కింద చీకటిలా అక్కడి రైతులు మగ్గిపోతున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నామన్న సంతోషమే కానీ, వారు ఎదుర్కొంటున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ప్రాజెక్టు నిర్మాణంతో తమకేమీ లాభం లేకుండా పోయిందన్న వేదన అక్కడి రైతుల్లో నెలకొంది. అంతే కాకుండా బ్యారేజీల బ్యాక్ వాటర్‌తో పంట భూములు మునకకు గురవుతుండటంతో అప్పుల పాలవుతున్నామని రైతులు అంటున్నారు.
ప్రాజెక్టు నిర్మాణంతో…
రాష్ట్రాన్ని సస్యశామలం చేసేందుకు ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లల వద్ద బ్యారేజీలను నిర్మించింది. ఈ మూడు బ్యారేజీలు కూడా మంథని నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. వీటి నిర్మాణం వల్ల విలువైన భూములను కోల్పోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, బ్యారేజీల్లో ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్ఆర్ఎల్) వరకు నీటిని నిలువ ఉంచినప్పుడు అధికారుల అంచనాలను మించి భూములు మునకకు గురవుతున్నాయి. అలాగే, బ్యారేజ్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలినప్పుడు కూడా పంటలు మునిగిపోతున్నాయి. దీంతో తాము వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా పోతోందని రైతాంగం అంటోంది. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ వల్ల ఇప్పటికే అధికారులు సేకరించిన భూమితో పాటు మరో 600 ఎకరాల భూమి మునకకు గురవుతోందని అధికారులు తాజాగా చేసిన సర్వేతో తేల్చారు. అలాగే, అన్నారం బ్యాక్ వాటర్ కారణంగా మంథని మండలం మల్లారం రైతులు గత మూడేళ్లుగా పంటలు సాగు చేయడమే మానుకున్నారు. అన్నారం గేట్లు ఎత్తినప్పుడు దిగువకు నీటిని వదిలినప్పుడు చండ్రుపల్లి, నాగేపల్లి గ్రామాలకు చెందిన పంట పొలాలు మునకకు గురవుతున్నాయి. దీంతో పంట వేసి మరీ ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతున్నామని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయంటే చాలు మా పంటలపై ఆశలు వదులుకోవల్సిన పరిస్థితే తయారైందని మంథని ప్రాంత రైతాంగం చెబుతోంది. సుందిళ్ల బ్యారేజ్‌కి దిగువన ఉన్న గుంజపడుగు, విలోచవరం, ఉప్పట్ల గ్రామాల్లో కూడా పంటలు మునిగిపోయాయి. మునిగిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ ఆయా ప్రాంతాల రైతాంగానికి కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ వల్ల పంటలు నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహదేవపూర్ మండల సభ తీర్మాణం కూడా చేసింది.
వీరిదో కష్టం…
దిగువ ప్రాంతాన ఇలా ఉంటే మంథనికి ఎగువన ఉన్న రైతులదో దీనగాథ. ఎస్సారెస్పీ టేల్ ఎండ్ ఏరియా కావడంతో ఇక్కడికి నీరందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నాలుగు నుండి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదిని చూసుకుని మురిసిపోవడమే తప్ప ఆ నీటిని పంట పొలాలకు తరలించుకుపోయే పరిస్థితి మాత్రం కనిపించడం లేదన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ఓ వైపున గోదావరి, మరో వైపున ఎస్సారెస్పీ కెనాల్స్ ఉన్నప్పటికీ ఈ ప్రాంత రైతులు బోరు బావులపై ఆధారపడుతున్నారు. బోరు బావులైనా తమ పొలాలకు సరిపడా నీళ్లందిస్తున్నాయన్న సంతషంతో కాలం వెల్లదీద్దామంటే సింగరేణి బొగ్గు వెలికితీత వారి పాలిట శాపంగా పరిణమించింది. 12 గ్రామాల రైతులు ఒక్కో పొలంలో మూడు నుండి నాలుగు వరకు బోర్లు వేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రూ. 10 లక్షల వరకు అదనపు భారం పడిందని రైతులు వివరించారు. సింగరేణి సంస్థ బొగ్గు వెలికితీత కోసం భూ గర్భంలో జరుపుతున్న బ్లాస్టింగ్‌ల వల్ల తమ పొలాల్లో వేసుకున్న బోర్లకు సంబందించిన కేసింగ్ పైపులు శిథిలమై పోతున్నాయి. బ్లాస్టింగ్‌లతో భూమి లోపల వచ్చిన కదలికల వల్ల బోర్ల కింద నీరు మరింత లోతుకు వెళ్లిపోతోంది. దీంతో మరో చోట బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి తయారైంది. ఇలా పలు రకాల సమస్యలు ఎదురవుతున్నా తమను పట్టించుకునే వారే లేకుండా పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో నీరందకపోవడం ఈ సారి ఈ ప్రాంత రైతులు నెల రోజులు ఆలస్యంగా నాట్లు వేసుకున్నారంటే వీరి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆందోళనతోనే సరి…
అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తడం వల్ల తమ పంటలు మునిగిపోయాయని అక్కడి రైతులు ఆందోళన చేశారు. ఇదే బ్యారేజ్ బ్యాక్ వాటర్‌తో రోడ్డున పడ్డామని మల్లారం రైతులు ఉద్యమం చేశారు. అయినా, రైతాంగానికి మాత్రం ఎలాంటి లాభం చేకూరలేదు. అధికారులు సర్వేలు చేస్తామని చెప్పడంతో సరిపెడుతూ కాలం వెల్లదీస్తున్నారు తప్పా.. లాభం మాత్రం చేకూర్చడం లేదని రైతాంగం ఆరోపిస్తోంది. ఆందోళనలు చేయడం తప్ప సర్కారు నుండి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదని రైతాంగం వాపోతోంది.
లిఫ్టుల పరిస్థితి అంతే…
గోదావరి తీరంలోని పంటలకు నీళ్లందించాలన్న లక్ష్యంతో గతంలో ఏర్పాటు చేసిన చిన్నతరహా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మానేరు దిగువ ప్రాంతాలకు సాగు నీటిని అందించేందుకు 15 ఏళ్ల క్రితం ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఐదేళ్ల క్రితం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి దీని పేరు చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలగా మారిపోయింది. నేటికీ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలు నెరవేరక ఆయాకట్టు రైతాంగం అంతా చిన్నబోయి చూస్తోంది.
మరో ఉద్యమానికి రంగం సిద్ధం..
మంథని సమీపంలోని పోతారం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత అధికార పార్టీ నాయకులు ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. 12 గ్రామాల్లోని 10 వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. దీంతో ఆ ప్రాంత అధికార పార్టీ నాయకులే ఉద్యమం చేపట్టాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 1న మంథని నుండి పెద్దపల్లి వరకు పాదయాత్ర చేపట్టాలని కూడా నిర్ణయించారు. గోదావరి పరివాహక ప్రాంతమైన మంథని నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు కూడా సాగు నీటి కోసం అల్లాడుతున్న పరిస్థితే తయారు కావడం విచిత్రం. తమ కళ్ల ముందే గోదావరి జలాలు ఎగువ ప్రాంతానికి ఎత్తిపోయడమో లేక ఎక్కువ అయితే సముద్రంలోకి వదలడమో చేస్తున్నారు తప్పా తమ పంటపొలాలకు మాత్రం ఆ నీటిని మళ్లించేందుకు చొరవ చూపడం లేదన్న వేదనను వ్యక్తం చేస్తున్నారు.