వ్యాక్సినేషన్‌లో గోల్‌మాల్.. తగ్గేదేలే అంటున్న బాధితుడు

by Anukaran |   ( Updated:2021-04-26 07:46:18.0  )
వ్యాక్సినేషన్‌లో గోల్‌మాల్.. తగ్గేదేలే అంటున్న బాధితుడు
X

దిశ, మాహబూబాబాద్: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో గోల్‌మాల్ వ్యవహారం కలకలం రేపింది. ప్రభుత్వం ఆన్‌లైన్ విధానంలో వ్యాక్సిన్‌ కోసం స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. కానీ, రిజిస్టర్ చేసుకున్న తర్వాత.. టీకా వేయించుకోకముందే వ్యాక్సినేషన్ సక్సెస్‌ఫుల్ అయిందని సర్టిఫికేట్ వచ్చిన వ్యవహారం మాహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మాహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రానికి చెందిన రాజేందర్ సింగ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు కొవిన్ యాప్‌లో ఈ నెల 22వ తేదిన రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేసముద్రం మండలం ఇనుగుర్తి పీహెచ్‌సీలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య వ్యాక్సిన్ వేయించుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాడు. కానీ, సోమవారం వ్యాక్సిన్ వేసుకునేందుకు వెళుతున్న సమయంలోనే ఆయన మొబైల్‌కు వ్యాక్సిన్ వేయడం సక్సెస్‌ఫుల్ అయిందని మేసేజ్ వచ్చింది. దీనికితోడు వ్యాక్సిన్ వేసినట్లు సర్టిఫికెట్ కూడా మొబైల్‌ నెంబర్‌కు రిసీవ్ అయింది.

ఇది చూసిన రాజేందర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తాను ఇంటి వద్దే ఉన్నా.. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి కావడం ఏంటన్న అనుమానంతో ఇనుగుర్తి డాక్టర్ అనిల్‎కు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది. సాంకేతిక సమస్య వల్ల రాజేందర్‌కు మేసేజ్ వచ్చిందని సదరు డాక్టర్ వివరణ ఇచ్చాడు. మరో వ్యక్తి పేరు చివర కూడా సింగ్ అని ఉండడంతో.. వ్యాక్సినేషన్ అనంతరం కన్ఫ్యూజన్‌లో మేసేజ్ సెండ్ చేసి ఉండొచ్చని చెప్పారు. ఇక డాక్టర్ ప్రతిస్పందనతో కూడా బాధితుడు రాజేందర్‌ సంతృప్తి చెందనట్టు తెలుస్తోంది. వ్యాక్సినేషన్‌ గోల్‌మాల్‌పై సీరియస్‌గా తీసుకొని జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు బాధితుడు. కాగా, కరోనా నివారణలో కీలకమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇలా సాంకేతిక సమస్యలు రావడం గమనార్హం.

వ్యాక్సినేషన్ సర్టిఫికేట్.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన స్క్రీన్ షాట్స్..

Advertisement

Next Story