కన్యాకుమారి నుంచి కాలినడక @4 వేల కిలోమీటర్లు

by Shyam |
కన్యాకుమారి నుంచి కాలినడక @4 వేల కిలోమీటర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ టైమ్స్‌లో మెంటల్ హెల్త్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యువత నిరాశ నిస్పృహలకు గురవుతోందని, ఆందోళనలు పెరిగిపోయి ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పలు సర్వేల్లో తేలింది. పైగా కొవిడ్ ప్రభావమూ ఇందుకు ఓ కారణంగా చెప్పొచ్చు. కాగా 2020లో 7.5 శాతం మంది భారతీయులు మానసిక రుగ్మతతో బాధపడ్డారని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) సైతం తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పుణెకు చెందిన రోనిత్ రంజన్ అనే లైఫ్ కోచ్ పాదయాత్ర చేపట్టారు. కన్యాకుమారిలో మొదలైన అతడి పాదయాత్ర లేహ్ వరకు కొనసాగనుండగా.. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

రోనిత్ రంజన్.. దేశ రక్షణ విభాగాల్లో పని చేయాలనే సంకల్పంతో కష్టపడి చదివాడు. ఫిజికల్ ఫిట్‌నెస్‌‌ పెంచుకోవడంతో పాటు సంబంధిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సాయుధ దళంలో చేరాడు. కానీ, దురదృష్టవశాత్తు 2017లో జరిగిన ఓ ప్రమాదంలో ఆయన వెన్నుముకకు గాయం కావడంతో ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో జాబ్ మానేయాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో డిప్రెషన్‌కు గురైన రంజన్‌ను సూసైడ్ ఆలోచనలు చుట్టుముట్టాయి. కానీ ఆత్మహత్య చేసుకుంటే జీవితానికి అర్థమేముంటుందని భావించి, ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే యువతకు శిక్షణనిచ్చి వారిని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సాయుధ దళాల్లోకి పంపాలని నిర్ణయించుకున్నాడు. యువతీ యువకులకు ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి గైడ్ చేస్తూనే.. వారికి మానసిక బలాన్ని అందించాలని భావించి లైఫ్ కోచ్‌గా మారాడు. ఈ క్రమంలో మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకు కన్యాకుమారి నుంచి కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ రాజధాని లేహ్ వరకు 4 వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. ఈ మేరకు నవంబర్ 16న నడక ప్రారంభించిన రంజన్.. ప్రస్తుతం హైదరాబాద్‌కు చేరుకున్నాడు.

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలంటున్న రంజన్.. ఇప్పటి వరకు 1,250 కిలోమీటర్లు పూర్తిచేశాడు. ఆయన మార్చి 31నాటికి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనుండగా.. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు మెంటల్ హెల్త్ కరికులమ్ రూపొందించాలని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు పిటిషన్ ఇవ్వనున్నట్లు తెలిపాడు. అనంతరం లేహ్ వరకు పాదయాత్ర కొనసాగిస్తానని పేర్కొన్నారు. తనకు టీచర్లు, ఆఫీసర్లు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తల నుంచి సహకారం లభిస్తోందని.. తన పాదయాత్రలో భాగంగా పలు పాఠశాలలను సందర్శిస్తూ, వారికి మెంటల్ హెల్త్‌పై అవగాహన కల్పిస్తున్నట్టు వెల్లడించాడు. పాఠశాలలు, కాలేజీల్లో ‘మెంటల్ హెల్త్ వీక్’, ‘మెంటల్ హెల్త్ డే’ పేరిట అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మానసికంగా బలంగా ఉండాలనేది తన లక్ష్యమని, అందుకు తన వంతు కృషి చేస్తానని చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed