ఆ రోజు నేనెక్కడున్నానంటే.. వసూళ్ల ఆరోపణలపై మహారాష్ట్ర హోంమంత్రి వివరణ

by Shamantha N |
Maharashtra Home Minister Anil Deshmukh
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో రాజకీయ కలకలం రేపిన హోంమంత్రి వసూళ్ల వ్యవహారంపై హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పందించారు. ముంబయి మాజీ పోలీస్ ఆఫీసర్ పరంబీర్ సింగ్ ఆరోపించినట్టు.. తాను ఎవర్నీ కలవలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ.. పలు విషయాలపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా రెండు వీడియోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనమీద దుష్ప్రచారం చేస్తున్నారనీ, ఫేక్ వీడియోలు సృష్టించి తనకు సంబంధంలేని విషయాలను అంటగడుతున్నారని అన్నారు.

వీడియోలో అనిల్ మాట్లాడుతూ… ‘కొద్దిరోజులుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది. గతేడాది కొవిడ్-19 సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించడానికి నేను రాష్ట్రమంతటా తిరిగాను. పోలీసులకు ధైర్యం చెబుతూ వారిలో ఉత్సాహాన్ని నింపాను. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 5న నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో నేను నాగ్‌పూర్‌లోని ఆస్పత్రిలో జాయిన్ అయ్యాను. 15 వరకు నేను అక్కడే ఉన్నాను. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు గతనెల 27 దాకా హోంక్వారంటైన్ లోనే గడిపాను. వీడియో కాన్ఫరెన్సుల ద్వారానే సమావేశాలలో పాల్గొన్నాను. మార్చి 1న అసెంబ్లీ సమావేశాలు మొదలు కావడంతో అప్పట్నుంచే నేను ఇంటినుంచి బయటకు వచ్చాను..’ అని చెప్పుకొచ్చారు.

కాగా ఫిబ్రవరి 15న ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారని ఆరోపిస్తూ బీజేపీ ఒక వీడియో విడుదల చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. ‘నేను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి వెళ్తుండగా కొంతమంది జర్నలిస్టులు నన్ను ఆపి కొన్ని ప్రశ్నలడిగారు. దాంతో నేను కాదనలేక అక్కడే కాసేపు కూర్చుని వారు అడిగిన వాటికి సమాధానమిచ్చాను..’ అని అన్నారు. అనంతరం తాను ప్రత్యేక విమానంలో ముంబయికి వెళ్లి హోంక్వారంటైన్‌లో ఉన్నానని అనిల్ పేర్కొన్నారు. సోమవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూడా దాదాపు ఇవే విషయాలు చెప్పడం గమనార్హం.

Advertisement

Next Story