ముగిసిన ‘మా’ పోలింగ్.. ఓటింగ్‌లో రికార్డు

by Anukaran |
prakash raj, manchu vishnu
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల వరకు జరగాల్సిన పోలింగ్ ఓటింగ్ వినియోగించుకునేందుకు అనేకమంది సుదూర ప్రాంతాల నుంచి వస్తుండటంతో సమయాన్ని పొడిగించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జరిగిన పోలింగ్‌లో చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘మా’ ఎన్నికల పోలింగ్ సమయంలో జనరల్ ఎలక్షన్స్‌లో జరిగిన మాదిరిగానే ఉద్రిక్త వాతావణం చోటుచేసుకుంది. రిగ్గింగ్ జరుగుతుందంటూ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు, విమర్శలతో పోలింగ్ కేంద్రం వద్ద హడావిడి వాతావరణం నెలకొంది. అనేక ట్విస్టుల మధ్య ఎట్టకేలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

అయితే, ఈసారి భారీగా ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘మా’ అసోసియేషన్‌లో 925 మంది సభ్యులు ఉండగా.. అందులో 883 మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. అయితే, పోలింగ్‌లో 665 మంది ఓటర్లు(పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి) తమ హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 83 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. అంతేగాకుండా 60 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకున్నారు. మా ఎన్నికల్లో ఎప్పుడూ 500 ఓట్లకు మంది మించి పోలింగ్ నమోదవదు. ప్రతిసారి 480-490 మంది మాత్రమే ఓట్లు వేస్తుంటారు. కానీ ఈసారి ఓటింగ్ గణనీయంగా పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌ సహా పలువురు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అయితే, ఇంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికకు ప్రముఖ హీరోలు దూరంగా ఉన్నారు. అందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, రానా దగ్గుబాటి, రకుల్‌ ప్రీత్ సింగ్, ఇలియానా, త్రిష, హన్సిక తదితరులు ఓటు వేయలేదు.

కాగా, ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఇవాళ రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. రాత్రి 8 గంటలకు విజేతలెవరో అధికారంగా ప్రకటిస్తారు

Advertisement

Next Story

Most Viewed