ప్రపంచంలో కాస్ట్‌లీ అల్ట్రా రన్ ‘హైలాండ్ కింగ్స్’

by Shyam |
ప్రపంచంలో కాస్ట్‌లీ అల్ట్రా రన్ ‘హైలాండ్ కింగ్స్’
X

దిశ, ఫీచర్స్ : 42.2 కిలోమీటర్ల సుదీర్ఘదూరం సాగే పరుగుపందెంను మారథాన్‌గా చెప్పొచ్చు. సాధారణంగా దీన్ని రోడ్ రేస్‌గానే పరిగణించినా.. ట్రైల్ రూట్ల(కొండలు, నదులు, హైవే మార్గాల్లో)లోనూ దూరాన్ని కవర్ చేయవచ్చు. ‘మారథాన్’ అనే పదం గ్రీస్‌ నుంచి పుట్టింది. క్రీ.పూ 490 సంవత్సరంలో పర్షియన్స్‌తో జరిగిన యుద్ధంలో గ్రీకు సాధించిన విషయాన్ని చేరవేయడానికి ఆ దేశ సైనికుడు ఫిలప్పీడిస్ ‘మారథాన్ నుంచి ఏథెన్స్’ వరకు 25 మైళ్లు ఆగకుండా పరుగెత్తాడు. అతడి పరుగుకు జ్ఞాపకంగానే ఈ లాంగ్‌రేస్‌కు ఆ పేరొచ్చింది. అయితే ఇలాంటి మారథాన్‌లో పాల్గొనాలంటే సరైన శిక్షణ, ప్లానింగ్ అవసరం. రన్నర్లు తమను తాము సవాలు చేసుకోవడానికి ఇవి గొప్ప మార్గంగా నిలుస్తాయి. ప్రస్తుతం వరల్డ్‌వైడ్‌గా భిన్నరకాల మారథాన్స్ జరుగుతుండగా.. వీటిలో ‘హైలాండ్ కింగ్స్ మారథాన్’ అత్యంత లగ్జరీ రేస్‌గా ప్రసిద్ధి చెందింది. ఇందులో పాల్గొనే రన్నర్స్ ఎంట్రీ ఫీజుగానే 21,500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాంగ్‌ రేస్‌ ఎందుకంత ఖరీదైనదో తెలుసుకుందాం..

సాధారణంగా అల్ట్రా మారథాన్‌లకు లగ్జరీతో సంబంధం ఉండదు. పోటీదారులు రేసులో తమను తాము పరీక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఇందుకోసం కొండలు, గుట్టలు, రహదారులు సహా మారుమూల, కఠిన భూభాగాల వెంట పరుగులు పెడతారు. కొన్నిసార్లు బురద బాటల పక్కనే నిద్రిస్తారు. ఇంకొన్ని సందర్భాల్లో నిద్రను మరిచి పరుగులు పెడతారు. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు వెళతారు. కానీ ‘హైలాండ్ కింగ్స్ మారథాన్’ మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతుంది. పోటీదారులు నిద్రించడానికి కింగ్ సైజ్డ్ బెడ్స్. వర్షాన్ని తట్టుకునే వాటర్‌ప్రూఫ్ టెంట్స్. అలసట తీర్చడానికి స్పోర్ట్స్ మసాజ్‌. సేవల కోసం బట్లర్-సర్వీస్డ్ బెల్ టెంట్స్, ఫైవ్‌స్టార్ హోటల్ రుచులను అందించే ఫేమస్ చెఫ్స్. అంతేకాదు హైడ్రోథెరపీ పూల్స్‌, స్పీడ్ బోట్లను కూడా వారికి అందిస్తారు నిర్వాహకులు.

ఏడునెలల ప్రత్యేక శిక్షణ..

ఈ పోటీలో పాల్గొనడానికి నిర్వాహకులు కేవలం 40 మందిని మాత్రమే అనుమతిస్తుండగా.. 2022, ఏప్రిల్‌లో జరగబోయే ఈ రేస్ కోసం ఏడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. స్థానిక ప్రయోగశాలలో ‘స్వెట్ కంపోజిషన్’ పరీక్ష నిర్వహించి, దాని ఫలితం ఆధారంగా వారి వారి శరీరాలకు ఎలా శక్తిని అందించాలో ఓ అంచనాకు వస్తారు. దానికి తగ్గట్లుగా వారికి ట్రైనింగ్‌, ఫుడ్, డ్రింక్స్ అందిస్తారు. పార్టిసిపెంట్స్ మైండ్, ఫిజికల్ ఫిట్‌నెస్ పెంచేందుకు ఫిజియో, సైకియాట్రిస్ట్స్ నిత్యం వీడియో కాల్స్‌లో అందుబాటులో ఉంటారు. అంతేకాదు అల్ట్రా-రన్నింగ్ ప్రపంచ చాంపియన్ ‘జోనాథన్ అల్బోన్‌’తో తమ రేసుకు సంబంధించిన విషయాలపై చర్చించి సందేహాలు తీర్చుకోవచ్చు. అల్ట్రా రన్నర్, ఆర్మీ మ్యాన్ ‘అన్నా-మేరీ వాట్సన్’ నుంచి వ్యక్తిగత కోచింగ్ కూడా పొందొచ్చు.

తూర్పు నుంచి పడమరకు

స్కాట్లాండ్‌లోని అత్యంత ప్రసిద్ధ లోయల్లో ఒకటైన గ్లెన్‌కో తూర్పు అంచులోని డాల్నెస్ నుంచి మొదలయ్యే ఈ రేస్.. పశ్చిమ హైలాండ్ మార్గంలో దక్షిణం వైపుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కొండ మైదాన ప్రాంతాల ద్వారా లోచ్ ఫైన్ (స్టేజ్ 2- 32 మైళ్లు) వరకు సాగుతుంది. ఆ తర్వాత కోవెల్ ద్వీపకల్పం, పశ్చిమ తీరంలోని పోర్టావాడీకి 34 మైళ్ల వరకు మూడో స్టేజ్ పూర్తవుతుంది. ఫైనల్‌గా ఐరాన్ అరన్‌లో 28 మైళ్లు పూర్తవుతాయి. చివరగా పోటీదారులు ఒక విలాసవంతమైన క్యాంప్‌సైట్‌లో రాత్రంతా గడుపుతారు. అక్కడ ఎక్స్‌ప్లోరర్ ‘సర్ రనుల్ఫ్ ఫియన్నెస్‌’తో కలిసి విందులో పాల్గొంటారు.

లగ్జరీ అల్ట్రా-రన్ అనుభవం అందించేందుకే..

రన్నర్స్ యోధుల్లా రేసులో పాల్గొనాలి.. ఆ తర్వాత రాజులాగా కోలుకోవాలి. అందుకోసమే రేసర్లకు భూమ్మీద అత్యంత లగ్జరీ అల్ట్రా-రన్ అనుభవాన్ని అందించేందుకు ఈ హైలాండ్ కింగ్స్ నిర్వహిస్తున్నాం. సంవత్సరాలుగా బుష్ క్రాఫ్ట్, అడ్వెంచర్ కోర్సులను అందిస్తున్నాం. ఈ క్రమంలో ఓసారి ఫ్రెంచ్ రేసర్లు కొంతమంది లగ్జరీ రన్నింగ్ ట్రిప్ నిర్వహించమని కోరడంతో ఈవెంట్ చేశాం. అది పెద్ద సక్సెస్ కావడంతో ఈ రేస్ ప్లాన్ చేశాం.

– రెబెక్కా సిల్వా, రేస్ డైరెక్టర్

కాస్ట్‌లీ పరుగు :

సాంకేతికంగా చూస్తే ‘వరల్డ్ మారథాన్ చాలెంజ్’ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రేసు. దీని ఎంట్రీ ఫీజు 47,300 డాలర్లు – 50,000 వేల డాలర్ల మధ్యన ఉంటుంది. ఇందులో భాగంగా ఏడు ఖండాల్లో ఏడు మారథాన్‌లు నిర్వహిస్తారు. విమాన ప్రయాణంతో పాటు అకామిడేషన్ సదుపాయాలు నిర్వాహకులే చూసుకుంటారు. అయితే ఒకే ప్లేసులో లేదా ఒకే దేశంలో నిర్వహించే మారథాన్ విషయానికి వస్తే ‘హైలాండ్ కింగ్స్ అల్ట్రా’ ప్రపంచంలో మోస్ట్ లగ్జరియస్ రేసుగా నిలుస్తోంది.

* అంటార్కిటికాలోని ‘ది లాస్ట్ డిజర్ట్’ మారథాన్ రేసు 11 రోజుల పాటు జరుగుతుంది. అయితే అక్కడికి పడవలో చేరుకునేందుకు, అకామిడేషన్ కోసం 12,900 డాలర్లు చెల్లించాలి.
* ‘అంటార్కిటిక్ ఐస్’ మారథాన్ (100 కి.మీ) ఎంట్రీ ఫీజు $ 18,900. కాగా ఇందులో భాగంగా ఆహారం, వసతి, విమాన సౌకర్యాలు కల్పిస్తారు.
* సహారా ఎడారిలో 7 రోజుల పాటు జరిగే ‘మారథాన్ డెస్ సేబుల్స్’లో ఎంట్రీకి 3,270 యూరోలు (£ 2,796) ఖర్చవుతుంది. అయితే ఇందులో రన్నర్లు తమ పరికరాలన్నింటినీ 155 మైళ్ళు (250 కి.మీ) మోసుకెళ్లాల్సి ఉంటుంది.
* అటకామా క్రాసింగ్ లాంగ్ రేసు ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో 250 కి.మీ నడవాల్సి ఉండగా, దీని ఎంట్రీ ఫీజు $ 3,800.
* ప్రపంచంలోనే సుదీర్ఘంగా జరిగే అల్ట్రా మారథాన్స్‌లో 95-మైళ్ల ‘వెస్ట్ హైలాండ్ వే’ రేస్ ఒకటి. ప్రవేశ రుసుం £ 120.

Advertisement

Next Story

Most Viewed