- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి ముహూర్తాలు ఇప్పట్లో లేవు.. మంచి రోజులు అప్పుడే!
దిశ ములుగు : కొత్త సంవత్సరం వచ్చిందన్న ఆనందంతో యువత కేరింతలు కొడుతుంటే ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు తక్కువేనని చెబుతుండటంతో పెళ్లీడుకొచ్చిన వారిని నిరుత్సాహపర్చనుంది. గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెనువెంటనే రావడంతో పెళ్లి ముహూర్తాలకు కాస్త అడ్డంకిగా మారుతోంది. ఈ నెల 8వ తేదీ వరకే మంచి ముహూర్తాలు ఉన్నా, 7వ తేదీనే చివరి మంచి ముహూర్తమంటూ సిద్ధాంతులు చెబుతున్నారు. మే నెల వరకూ మంచి ముహూర్తాలు లేవని వెంకటాపూర్ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబా రఘునాథచార్యులు తెలిపారు.
మే 14న బలమైన ముహూర్తం..
ఈ నెల 8తో పెళ్లి ముహూర్తాలకు శుభం కార్డు పడితే, తిరిగి మే 14న మంచి ముహూర్తం ఉంది. అప్పటి నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 14న శూన్యమాసం ప్రారంభమై ఫిబ్రవరి 12 వరకూ కొనసాగనుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు అనేవేవీ ఉండవని అర్చకులు అంటున్నారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 12 వరకూ అంటే సుమారు నెల రోజుల పాటు గురు మౌఢ్యమి ఉంటుందని అర్చకులు అంటున్నారు.
80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి
ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ సుమారు 80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి ఉంటుందని సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ తర్వాత శుభ దినాలు ప్రారంభమైనప్పటికీ 10 రోజులు పాటు అంత బలమైన ముహూర్తాలు లేవని అంటున్నారు. మే 14 నుంచి బలమైన ముహూర్తాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
జూలై 4 నుంచి ఆషాఢం..
ఈ ఏడాది మే 14 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ కొద్ది రోజులు మాత్రమేనని పండితులు అంటున్నారు. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఆ సమయంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచి రోజులు కావని చెబుతున్నారు. 2021లో బలమైన ముహూర్తాల కొరత ఎక్కువగానే ఉంటోందని అర్చకులు అంటున్నారు. ఇన్నాళ్లు కొవిడ్ ప్రభావంతో పెళ్లిళ్లకు బ్రేక్ పడితే, ఇప్పుడు నెలల తరబడి సుముహూర్తాలు లేవనే అంశం పెళ్లిపీటలు ఎక్కబోవాలనుకునే వారిని నిరుత్సాహపరుస్తున్నాయి.
రెండు మూఢాలు అరుదు..
గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి ఇలా రెండు వరుసగా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇవి చెడు ప్రభావాన్ని కలిగించనప్పటికీ ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేయడానికి అంత మంచి రోజులైతే కాదు. అలాగని శాస్త్రీయంగా చెడు జరుగుతుందనేందుకూ సరైన ఆధారాల్లేవు. జీవితంలో పెళ్లి ముఖ్యమైన ఘట్టమైనందునా శుభ ముహూర్తంలో చేసుకోవడం మంచిదని పండితులు తెలుపుతున్నారు.