మిడతల బెడద.. ఉత్తరాది రైతులు బెంబేలు

by Shamantha N |
మిడతల బెడద.. ఉత్తరాది రైతులు బెంబేలు
X

న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా, మరోవైపు వడగాలులతో వణికిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలకు మిడతల రూపంలో మరో సమస్య ఎదురైంది. ఇరాన్, పాకిస్తాన్‌ల మీదుగా భారత్‌లోని రాజస్తాన్‌లోకి ప్రవేశించిన మిడతల దండు.. పంటల పొలాలను నాశనం చేస్తోంది. రాజస్తాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీలలో వీటి దాడి తీవ్రంగా ఉంది. సోమవారం రాజస్తాన్‌లోకి ఎంటరైన ఈ మిడతల గుంపు జైపూర్‌ చుట్టుపక్కలకు, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీకి చేరినట్టు సమాచారం. కొన్ని గుంపులు ఉత్తరప్రదేశ్‌కూ వెళ్లాయి. దీంతో సోమవారం నుంచే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో పంటను కాపాడుకునేందుకు మిడతలతో రైతులు ఓ యుద్ధమే చేస్తున్నారు. ఈ మిడతల గుంపులు ఇప్పటికే రాజస్తాన్‌లోని 18 జిల్లాలు, మధ్యప్రదేశ్‌లోని పదికిపైగా జిల్లాల్లో పంటలను నష్టపరిచాయి. మరో 17 జిల్లాల్లోని పంటకు ఈ ప్రమాదం పొంచి ఉన్నది. మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని జిల్లాల్లో రైతులు రసాయనాలను పిచికారి చేసి, వంట సామగ్రితో శబ్దాలు చేసి మిడతల గుంపులను దారి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలోనే మిడతలూ నేలరాలుతున్నాయి.

కాగా, ఈ సారి మిడతలకు అనుకూలంగా వాతావరణ పరిస్థితులు ఏర్పడటం, వర్షాలు కురవడం వంటి కారణాలతో ఈ ఏడాది అత్యధికంగా మిడతలు భారత్‌లోకి ప్రవేశించనున్నాయి. గత 26 ఏళ్ల కాలంలోనే అతి తీవ్రంగా ఈ మిడతల సమస్య ఉంటుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేశారు. ఈ మిడతల దాడితో పంట నష్టం తద్వారా దేశానికే ఆహార భద్రత సమస్యను తెచ్చిపెట్టవచ్చని చెబుతున్నారు.

Advertisement

Next Story