సామాజిక రుగ్మతలపై కవితా యుద్ధం…

by Ravi |   ( Updated:2024-08-04 18:45:56.0  )
సామాజిక రుగ్మతలపై కవితా యుద్ధం…
X

“తెలంగాణ కైతల దొంతులు” పుస్తక రచయిత హృదయం సహృదయం. నిత్యం తపించే కవితా ప్రవాహం. కవయిత్రిగా కలంతో కథనరంగాన విజృంభించిన కవితామూర్తి. తన రచనల సారాంశం తన హృదిలో మెదిలే ఎన్నోవేల సంఘర్షణల కలగలుపు ఈ తెలంగాణి. రచయిత హృదయ స్పందనల వెనుక భారం బరువైంది. తూటాలైన పదాలు శబ్దాలై గుండెల అంచున నిప్పు కనికలై ప్రతి పంక్తి ఎందున భగభగమంటూ ఉత్తేజమైన భావ ప్రకంపనలతో విజృంభిస్తూ తెలంగాణ గొంతై, బాసటై, ఆయుధమై కదిలిన కవిత కాళికయ్యింది.

పుస్తకం చదివిన తర్వాత జూపాక సుభద్ర కవయిత్రిగా, కథకురాలిగా, సామాజిక ఉద్యమకారునిగా, నాయకురాలిగా, ఉపన్యాసకురాలుగా, సాహితీవేత్తగా, పరిశోధనలు చేస్తూ తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని అణగారిన పీడిత ప్రజల నిలిచివేతలను పెత్తందారుల దోపిడీలను, మగ పైశాచికత్వాన్ని, కుల మౌఢ్యాలను, ఆధిపత్య అహంకారులను, వలస దాడులను, బంగారు తెలంగాణకై అన్నింట స్పందిస్తూ సమాజంలో బలహీనులకు బలమై తన సాహిత్య వనంలో ఎన్నో అంశాలపై కలాన్నే గళంగా చేస్తూ సాహిత్య కణికై వెలుగులు నింపుతూ అక్షర బాణాలతో అణిచివేతలకు, వివక్షలకు సాహిత్య యోధురాలుగా రచయిత కనిపిస్తుంది. పుస్తకంలో ఉపయోగించిన యాస భాష పదాల పొందిక ఎంతో రమ్యమైనది.

సంతోషం ఓ సల్లటి మట్టి కుండ...

యెంత సల్లటి మాటనే యెల్లక్కా/సందమామ నాకుండ సట్టిల బడ్డమాట /సుక్క పాపలు నా సంకెక్కిన సంబురమ్మాట /దిక్కులన్నీ నా పక్కల కొచ్చిన పండుగ నుండి పచి యెన్నెలమ్మలు నా దిగుట్లె దీపం బెట్టిన కోలాటాలు అంటూ…. తెలంగాణ ప్రజల ఆకాంక్ష బానిస బ్రతుకుల విముక్తి నుండి ప్రజలు ఊపిరి పీల్చుకుందామంటూ సాంప్రదాయ పద్ధతిలో సంతోషాన్ని సల్లటి మట్టి కుండ నీళ్లతోనూ, అంబలి, బోనాలు, ముగ్గులు, బతుకమ్మలు, కోలాటాలు, తీన్మార్లు, నలుదిక్కులు నాట్యం ఆడాలి అని సాంప్రదాయాలతో అలుకేసినట్టుగా వర్ణించడం రచయిత ప్రత్యేకత. ముడికింద మూటంజేసిండు/ మీది మెట్టుల్నే పాది గట్టి, కట్టబోసి కట్టడి జేసిన కనికట్లు/ కడజాతి కండ్లల్లనే గానీ, గొంతు తడపనియ్యని గోస నాది/అంటూ సాగే ధార ప్రయాణం.. నేను (నీరు)నా సృష్టి జీవకోటికి ప్రాణదాతను. దేశాలు, రాజ్యాలు నాకై స్వార్థపూరిత ఒరలతో గర్జిస్తున్నాయి. నా దేహం ఎప్పుడూ అందరి దాహం. నేనెప్పుడూ పల్లానికి దాసోహమంటూ నీటి యుద్ధాన్ని పదునైన పదాలతో అల్లిన ప్రవాహం హృదయ విదారకం.

ఆదిమ సంతానాన్ని అదిమివేసి...

మూతికి ముంత, ముడ్డికి తాటాకులు గట్టి/ వూరు అంచులకు అడవి పంచలకు తరిమి సంపుతుంటే... చరిత్రలో కనుమరుగైన దళిత జాతి పుట్టుకను, చరిత్రను దగాపడ్డ దళిత జాతి ఆత్మ గౌరవాన్ని, వాస్తవాల చరిత్రను చిదిమేసి పాతిపెట్టిన వైనాన్ని పాఠకుల కళ్లకు కట్టినట్లు అనిపిస్తుంది. చరిత్ర పుటలకు వారసులమైన ఆదిమ సంతానాన్ని అదిమివేసిన వైనం ఆవిష్కరిస్తుంది. తాతా... నువ్వు తోలిన నల్లపిట్ట/ తొంగన్న సూడలే నీ పుస్తకాలను నా హస్తరేఖలకు/ సమాజంలో అనేక ప్రతికూలతలను ఎదుర్కొని విశ్వమానవాళికి విశ్వనరుడిగా పేరుపొందిన గుర్రం జాషువా సాహిత్యాన్ని ఏ అరాచక శక్తులు అడ్డుకుంటున్నాయో తెలుసుకోవాలి తేల్చుకోవాలి.

మా అడుగు ఎప్పుడూ ముందే

ఆటల అడుగుల పండుగ ముండ్లు సీర్కపోయినా/ రాల్లు గీర్కపోయినా /ఆకలిదప్పులు మరిసి అడివంత గాలిచ్చి/బతకమ్మ కోరేదంటూ… ఎందరో ఆడబిడ్డ బతుకుల్లో వెలుగులు నింపుతూ అలసిన వయసుకు బరువైన మనసును తేలిక పరిచే రంగురంగు ఆకర్షణీయమైన పూలతో మెరుపులతో పుట్టింట జరిపే పండగే బతుకమ్మ అంటూ సాంప్రదాయ పండుగను ఎంతో సున్నితమైన హృదయంతో అక్షరాల పూలతో అలంకరించడం కనబడుతుంది. రాజ్యాన్ని నడిపిన నాయకత్వాలు/ సబ్బండ కళలకు నెలువులు/ పోరుకు పొద్దులైన ఆడిబిడ్డెల/ అడుగు ముందు బడందే/ ఏ వుద్యమాలు వూరు దాటలే/ ఏ పోరులు పొగసూరలే …అని రాచరిక పాలన నుండి యుద్ధాలు చేసి ఎందరో రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించి బంగారు తెలంగాణగా మారిన నేలను పెత్తందారుల దొరతనానికి దోపిడీ కాబడిన ఈ నేలను కాపాడడానికి మా అడుగు ముందే పడింది మా అడుగు ఎప్పుడూ ముందే. మా తండ్రుల నెత్తురు పోరితేనే/హైద్రాబాదమ్మ సలువ పందిరైంది.

యూనివర్సిటీలంటే... ఖూనివర్సిటీలు

గడిచిన కాలంలో అనుభవించిన అంతరంగ ఘోషను తమ రెక్కల కష్టాన్ని, చెమట చుక్కలను, ఉడుకుతున్న రక్తాన్ని, కేకలు పెట్టే పేగుల్ని సైతం లెక్కచేయకుండా నా ఈ చెమట తెలంగాణకే నా నాడి తెలంగాణ పోరుకే అనే నినాదంతో తెలంగాణ ప్రజలకు ఉద్యమ సారధి అయ్యారు. యూనివర్సిటీలంటే మా పాలిటి ఖూనివర్సిటీలు/ మా వేళ్లను వేటాడిన ద్రోణుడి బాణాలు/ అవన్నీ మా పురాపొరల్లో సల్లారని సలుపుల కొలుపులు..

దళిత పీడిత పాలిట శాపాలు

విద్యాలయాలకు అరిష్టం పరాకాష్టకు చేరి కుల దురహంకారులను పెంచి పోషిస్తూ గురుకులం నీడలో కులం గొడుగు పట్టుకుంటూ రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుని అణగారిన దళిత పీడిత విద్యార్థుల పాలిట శాపాలుగా, ఉరిగా విద్యాలయాలు కులాన్ని మోస్తున్నాయి. కలిసుంటే కలదు సుకమని' నన్ను కల్లోలం జేసిండ్రు/ నా బిడ్డెలు పిడికెడు బువ్వకు అడివిల అన్నలైతండ్రు/అంటూ సాయుధ పోరాటాలు మొదలుకొని నేటి దాకా తుపాకులు పట్టి నా తెలంగాణ ఉద్యమం ఉధృతం కోసం కదలాలి రా బిడ్డా అంటూ మన బానిస బతుకులను, వలస ప్రభుత్వాలు మరింత ఆగడాలతో ఆగం చేస్తుంటే విడిపించడానికి డప్పులతో వెళ్లిన మన బిడ్డలు ఏరి, నా గడ్డ గాయపడింది అంటూ బాధపడుతూ రచయిత గుండెల్లో తమ ప్రాంతంలో ఎన్నో కల్లోల వేదనలకు ముగింపు పలికే నా రోజెన్నడో. సామాజిక అస్పృశ్యతలో మగ్గుతున్న సమాజాన్ని తన కవితల ద్వారా ప్రజల్లో స్ఫూర్తిని రగిలించిన రచయిత ఆలోచనా దృక్పథం అద్భుతం.

పుస్తకం : తెలంగాణ కైతల దొంతులు

రచయిత్రి: జూపాక సుభద్ర

పేజీలు: 1000 (వెయ్యి పేజీలు)

వెల: 150


ప్రతులకు

దండోరా పబ్లికేషన్స్

94410 91305


సమీక్షకురాలు

డాక్టర్ పద్మ పొనుగోటి

87903 41580

Advertisement

Next Story

Most Viewed