- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ మహిళామణులు.. స్వయం సిద్ధలు
ప్రస్తుతం తెలుగు కథా సాహిత్యాకాశంలో బాగా వినిపిస్తున్న పేరు ‘స్వయం సిద్ధ’. ఇది ఒంటరి మహిళల జీవన గాథల సంకలనం. పలుచోట్ల పరిచయ సభలు జరుపుకుంటూ స్వయం సిద్ధ విజయ కేతనం ఎగురవేస్తోంది. ఇందులో నా కథ ‘ఒంటరి పోరాటం’ కూడా చోటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంకలనం ఇంత చక్కగా రావటంలో సంపాదకులు బండారు విజయ, పి. జ్యోతి గార్ల అవిశ్రాంత కృషి గొప్పది. అభినందనీయమైనది.
అడుగడుగునా వారికి ఇబ్బందులే!
మహిళల ఒంటరి జీవిత ప్రవేశానికి, జీవిత భాగస్వామిని కోల్పోవటమో, ఇద్దరికీ భావాలు సరిపడక వేరుగా ఉండటమో, అవివాహితగా ఉండిపోవటమో ఇలా ఎన్నో కారణాలు. వారి వారి నేపథ్యాలు కూడా వేరుగా ఉంటాయి. ఆర్థిక భద్రత ఉన్న మహిళల పరిస్థితి ఒక విధంగా ఉంటే, కుటుంబంలో తల్లీతండ్రుల, తోబుట్టువుల అండదండలున్న ఒంటరి మహిళ స్థితి మరోలా ఉంటుంది. ఆర్థిక స్థితి లేక, ముందు వెనక ఎవరూ లేని, ఏ ఆసరా లేని ఒంటరి మహిళ జీవన గమనం ఇంకా కష్టంగా ఉంటుంది. మగవాళ్ల అధికారం కింద, పెత్తనం కింద ఆడవాళ్లు ఎలా నలిగిపోతున్నారో నేను ఊహించగలను. వివాహ బంధం తెంచుకోరాదనే నియమం మహిళల కన్నీటి కథలకు కారణమని ఆనాడు గురజాడ చెప్పారు. కుటుంబంలో భర్త, పిల్లలతో ఉంటూ కూడా మానసికంగా ఒంటరిగా ఉన్న స్త్రీలెందరో అప్పుడూ, ఇప్పుడూ కూడా! మహిళలు ఇష్టం లేని జీవితాన్ని బలవంతంగా గడపిన రోజులవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహిళలు ఉన్నత చదువులు చదువుతున్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. తమకు నచ్చిన జీవితాన్ని ఎంపిక చేసుకోగలుగుతున్నారు. పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. జీవితంలో ఒంటరి పోరాటానికి సమాయత్తమవుతున్నారు. ఇలా సమాజం ఎంతో పురోగమించిందనే అనుకుంటున్నాం.
ఒక మహిళ ఒంటరి జీవితంలోకి ఏ కారణం చేతనైనా ప్రవేశించినపుడు ఆమెకెదురయ్యే సమస్యలు, ఇబ్బందులు, సవాళ్లు ఎన్నో! ఆమెకు సాటి స్త్రీల నుంచే గౌరవభావం, స్నేహభావం, ప్రోత్సాహం ఉండదు. ఆమెను తప్పించుకు తిరుగుతుంటారు. ఒక విధమైన చులకన! ఒంటరి స్త్రీ ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో తలెత్తి నిలబడితే, పైకి ప్రశంసిస్తూనే మనసులో తేలిక భావం! సహించలేనితనం! అనేక కారణాల వల్ల మహిళలు ఒంటరిగా జీవించటం మొదలు పెట్టాక, ప్రారంభంలో ఎలా బతకాలో, ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితి నుంచి బైటపడి నిలదొక్కు కోవటానికి సమయం పడుతుంది. ఆ సమయంలో సమాజంలోని వ్యక్తులు వారికి స్నేహహస్తాన్ని అందించాలి. ఆత్మస్థైర్యంతో నిలబడడానికి కావాల్సిన సహాయం మద్దతు ఇవ్వాలి. కానీ, అలా జరగట్లేదనే చెప్పాలి. అడుగడుగునా ఒంటరి మహిళలకు సమాజం నుంచి ఇబ్బందులే. సమస్యలే అభద్రతా భావమే!
వాస్తవం నుంచి వచ్చిన కథలు..
నాటి సమాజంలో స్త్రీల సమస్యలను, స్త్రీ పురుష సంబంధాలను లోతుగా పరిశీలించిన వారు గురజాడ. ‘ఇప్పుడున్న సాంఘిక భావాలు పోయి, వాటి స్థానే కొత్తవి రావలసిన అవసరానికి మానవ పరిణామవాదం దారి తీస్తున్నది. కంటి ఎదుట స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవిక విషయాలకు భయపడి వాటిని మరుగు పుచ్చి తప్పించుకు తిరగడం వల్ల ప్రయోజనం లేదు’ అన్నారు గురజాడ. స్త్రీలు మేలుకోవాలి, తిరగబడాలి, ఎదిరించాలి. ఆధునిక మహిళ మానవ చరిత్రను తిరిగి లిఖించాలి, అన్నారు. అప్పుడు గురజాడ చెప్పింది ఇప్పుడు జరుగుతోంది. స్వయం సిద్ధ కథలలోని ఒంటరి మహిళలు ధీరలు. తమ జీవితంలో ఎదురైన అటుపోట్లని తట్టుకుని జీవితాన్ని జీవించి చూపారు. ఈ కథలలో కల్పనలు తక్కువ. వాస్తవంలో నుంచి వచ్చిన కథలు కాబట్టే వీటికి ఇంత బలం, గుర్తింపు!
శీలా సుభద్రాదేవి గారి నేనున్నాను కనుకనే కథలో ప్రమాదంలో భర్తను కోల్పోయి, ఉన్న అన్నయ్య బాధ్యత నుంచి తప్పించుకుంటే, దిగులు పడుతున్న కరుణను స్నేహితురాలు రాధిక నువ్వున్నావు కనుకే పిల్లలను కంటిపాపల్లా చూసుకోగలుగుతున్నావని ఆమెలో జీవితాశను కలిగిస్తుంది. ఇటువంటి సహకారమే ఒంటరి మహిళకు కావలసింది.
సి. భవాని గారి ప్రశ్నే జవాబుగా కథలో భర్తను కోల్పోయిన యమున, ఆఫీస్‌లో సాటి మగ ఉద్యోగుల వేధింపులు, వెటకారాలు, సందేశాలు చూస్తూ ఊరుకోలేదు. వెంటనే లైంగిక వేధింపుల కమిటీకి ఫిర్యాదు చేస్తుంది. రిటైరయ్యాక మహిళా కేంద్రాన్ని స్థాపిస్తుంది. స్త్రీల సమస్యలను స్త్రీలే పరిష్కరించుకోవాలి అంటుంది.
పి. జ్యోతి గారి గమ్యం కథలో మహిళ భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తూ కొడుకును ఎక్కడా తలవంచకుండా, టాలెంట్‌తో బతకాలని, మంచి స్కూల్లో చదివిస్తుంది. తను టీచర్‌గా పనిచేస్తూ, విద్యార్హతలు ఇంకా పెంచుకుంటూ ఎంత కష్టపడు తున్నా, తన సింగిల్ స్టేటస్‌ని వారికి అనుకూలంగా మలచుకోవాలని చూసే, స్టాఫ్‌ని ఎదిరించటానికి సిద్ధపడుతూ విద్యార్థుల శ్రేయస్సే ముఖ్యంగా భావిస్తూ, తన గమ్యాన్ని నిర్ధారించుకుంటుంది.
అలాగే బండారు విజయ గారి ఇడుపు కాయితాలు కథలో సుధ మధ్య తరగతి ఆడవాళ్లు విడాకులు తీసుకోవాలంటే సవాలక్ష సమస్యలు. యశోద తన పిల్లల కోసం, భవిష్యత్తు కోసం తగిన సమయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకుంది అంటుంది. ఇద్దరి స్త్రీల ఒకే పరిస్థితిని పోల్చి చెప్పిన కథ.
ఒంటరి స్త్రీలంటే వాళ్ళు రచయితలైనా, కళాకారులైనా, మగవాళ్ళు ఆ ప్రతిభను చూడరు. ఒంటరి మహిళ అనే దృష్టితోనే చూస్తారు అంటారు మందరపు హైమవతి గారు తన 'స్వయం ప్రకాశిత' కథలో.. ఇదెంత నిజం! తన జీవితంలోని అసంతృప్తులను అన్నింటినీ తుడిచిపెట్టేసిన ఆత్మాభిమాన గీతాన్ని! స్వయం ప్రకాశితను, అంటుంది ఇందులో ఒంటరి మహిళ.
ఇవి కొన్ని కథలు మాత్రమే! స్వయం సిద్ధలో ఏ కథ కా కథే వస్తువు రీత్యా ప్రత్యేకమైనది. విలువైనది. ఈ కథలు చదివాక ఇవి, మనను వెంటాడుతుంటాయి. ఆలోచింపచేస్తాయి. పురుషులు, స్త్రీలు అందరూ చదివితీరవలసిన పుస్తకం స్వయం సిద్ధ. ఈ కథలు పాఠకలోకానికి ఇంకా ఇంకా చేరువ కావలసి ఉంది.
ప్రతులకు
భండారు విజయ
భాగ్ లింగంపల్లి, హైదరాబాద్
88019 10908
వెల రూ. 300
సమీక్షకులు
డా. చెంగల్వ రామలక్ష్మి
63027 38678