సినీ సంగీత జలధి దాశరథి

by Ravi |   ( Updated:2024-08-11 18:46:09.0  )
సినీ సంగీత జలధి దాశరథి
X

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. అంటూ తన రచనలతో నాటి పాల నియంతృత్వ పోకడలపై గళమెత్తి తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపిన దాశరథి చిరస్మరణీయుడైన తెలంగాణ స్వేచ్ఛా వారధి.. కవితా జలధి..ఆంధ్రకవితా సారథి..! ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో..గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో..ఇలా అంటూనే రాసేసాడు కవితలెన్నో.. ప్రతి పోరడు..పౌరుడూ వీరుడయ్యేలా. నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాణి…. అంటూ తెలంగాణ ప్రజల హృదయతంత్రులను మీటి .! నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అప్పటికీ..ఇప్పటికీ.. ఎప్పటికీ అదే ప్రేరణ..తెలంగాణ స్ఫురణ. దాశరథి పలికించిన రుద్రవీణ..నిప్పు కణకణ..!తిమిరంతో సమరం చేసిన కలం ఉరకలెత్తిస్తే ధ్వజమెత్తిన ప్రజ.. అంతటి నిజామూ గజగజ!!!

నిజాం పాలకుల చేతిలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోయి జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్న తెలంగాణా ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని రగిల్చి నిజాం పాలనపై అక్షర శరాలు సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఉద్యమ వైతాళికుడు దాశరథి. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించి ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని ఆంటూ నిజాం నిరంకుశ మదగజంపై ఆక్షర అంకుశమైంది దాశరథి కలం. రక్కసుడై నిజాము రక్తపాతం సృష్టిస్తుంటే నిస్సహాయంగా రోదిస్తున్న తెలంగాణ ప్రజల కంటినీరే సిరాగా 'అగ్నిధార' సృష్టించిన దాశరథి.. పెన్నే గన్నుగా యుద్ధాలు నడిపిన మహారధి. రుద్రవీణ, అగ్నిధార, కవితాపుష్యకం, పునర్నవం, అమృతాభిషేకం, తిమిరంలో సమరం లాంటి సంకలనాలు, అద్భుత కావ్యాలు దాశరథి కలం నుంచి జాలువారినవి. మారుమూల గ్రామమైన చిన్నగూడూరులో జన్మించి ఎన్నో అవార్డులు, బిరుదులు అందుకుని తెలుగుభాష, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి దాశరథి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన కవిగా దాశరథికి అప్పటి ప్రభుత్వం గుర్తింపు నిచ్చింది.

మదిలో వీణలు మోగే...

కృష్ణమాచార్య కలంతో సినిమా సాహిత్యమూ సుసంపన్నమే. ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో మెదిలాయో ఆ ఊహలు. ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ రాసేశాడు పాటలు..హుషారు గొలిపే పూదోటలు.. ఈవేళ నాలో ఎందుకో ఆశలు..అన్న ఆ కలమే.. నా కంటిపాపలో నిలిచిపోరా...నీవెంట లోకాల గెలవనీరా అంటూ వాగ్దానం చేసింది. కొండంత అలకను తీరుస్తుంది, గోదారి గట్టుపై ప్రకృతి సోయగాన్ని వర్ణిస్తుంది. ఆ కవితా విపంచి మోగితే ఆశలెన్నో చెలరేగె కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా ఆంటూ పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ రూపమేరా ఆంటూ భక్తిని ఒలికించింది.

ఎప్పటికీ అస్తమించని కవి..

ఆ భక్తికి పులకించి కనరాని దేవుడే కనిపించి నడిరేయి ఏ జాములో స్వామి దిగివచ్చి నినుచేరిన క్షణాన, రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్యా నను పాలింపగ నడచీ వచ్చితివా, మొర లాలింపగ తరలీ వచ్చితివా గోపాలా, విన్నవించుకోనా చిన్నకోరికా ఇన్నాళ్లు నా మదిలో ఉన్న కోరిక.. అంటూ ఈ అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈ రేయి నీదోయి స్వామి అని సభక్తికంగా వేడుకుంది. కలయైనా నిజమైనా నిరాశలో ఒకటేలే.. అన్నది.. ఆ నిరాశలోనూ ఆశను కన్నది..! ఆవేశం రావాలి.. ఆవేదన కావాలి..గుండెలోని గాయాలు మండించే గేయాలు.. నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే అన్న కవి.. తెలుగు సాహితీ వినీలాకాశంలో ఎప్పటికీ అస్తమించని రవి!

(దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా)

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Advertisement

Next Story