- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చందమామ’ వెన్నెల దారుల్లో….
పుస్తకాలు మనసు పొరల్లో నిక్షిప్తమైన స్మృతులను శకలాలు శకలాలుగా తవ్వి తీస్తాయి. మధురమైన వాటి పరిమళం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన సన్నివేశాలు ఎన్నెన్నో ఉన్నాయి. ‘పుస్తకాలతో మమేకమైన వ్యక్తికి మనసు, మెదడు ఉన్నతంగా పనిచేస్తాయి అంటారు’ అబ్దుల్ కలాం. ‘గతకాలమే మేలు వచ్చు కాలము కంటెన్’ అనేది నిరాశ పూరిత వ్యాఖ్యానమని చెప్పేవారున్నారు. కానీ ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ‘చందమామ’ వంటి పిల్ల (పెద్ద)ల మాసపత్రిక వెదజల్లిన సాహితీ వెన్నెల చల్లదనంను మరిచిపోవటం ఎంత కష్టమో అనుభవజ్ఞులకు తెలిసిన సత్యం. ‘విజయ’ నాగిరెడ్డి- చక్రపాణిల మానస పు(ప)త్రికగా ‘చందమామ’ పబ్లికేషన్స్ దాదాపు 7 దశాబ్దాల పాటు దిగ్విజయంగా ఉన్నత విలువలతో నడిచిన పత్రిక ‘చందమామ’. కొడవటిగంటి కుటుంబరావు, చక్రపాణి, దాసరి సుబ్రహ్మణ్యం వంటి మహామహులు సంపాదకత్వ బాధ్యతలతో గొప్పగా నడిపారు. చిత్ర, శంకర్ వంటి చిత్రకారులు తమదైన ముద్రతో కథలు, సీరియల్స్‌కు వేసిన ‘చిత్రాల’లోని జీవం నేటికి సజీవమే నంటే అతిశయోక్తి కాదు. నా ఐదు దశాబ్దాల జీవన ప్రయాణంలో దాదాపుగా నాలుగు దశాబ్దాల కాలం ‘చందమామ’తోనే గడిచింది. చివరి సంచికను సహితం చదివాను. క్రమేపి వ్యాపారాత్మక ధోరణిలో ‘చందమామ’కు గ్రహణం పట్టింది. ‘చివర’కు ‘చరిత్ర’గా మిగిలింది.
నాటి సామాజిక సమస్యలు..కథలలో
‘చందమామ’ ఆ పేరు తలచుకుంటే ముందుగా గుర్తుకు వచ్చే ‘బుల్లి సంపాదకీయం’. అల్పమైన అక్షరాలతో అనల్పమైన భావాన్ని అమర్చి ఆ నెల ప్రాధాన్యతను వివరించే తీరు అమోఘం. క్లుప్తమైన భాష.. అనంతమైన భావం. చక్రపాణి గారి సంభాషణ చాతుర్యం వలనే సంపాదకీయ ఆంతర్యం ఖ్యాతి గడిచింది. మాచిరాజు కామేశ్వరరావు, వసుంధర, యండమూరి తదితరులు రచించిన ‘బేతాళ కథలు’ వారి రచన వ్యాసంగానికి, కీర్తి ప్రతిష్టలకు మూలాలు అంటే బహుశా నేటి తరం వారికి తెలియకపోవచ్చు. ‘చందమామ’లో వచ్చే కథలు జన బహుళ్యంలో మిక్కిలి ప్రచారం పొందాయి. పుస్తకాలను బైండులుగా చేసుకొని నేటికీ తమ ఇళ్లలో దాచుకున్న పెద్దలు నాకు తెలుసు. ఈ మధ్యకాలంలో ఏడు దశాబ్దాల సంచికలను కొంతమంది పీడిఎఫ్ రూపంలో భద్రపరిచి సామాజిక మాధ్యమాలలో ఉంచిన విధానం ‘చందమామ’పై అటువంటి వారికున్న అభిమానం తెలియజేస్తుంది. ఆ పత్రికలో కథ ప్రచురితమైతే వారు ఉత్తమ కథకులని సాహితీ ప్రపంచం గుర్తించిన సందర్భాలున్నాయి. పోలాప్రగడ, వసుంధర, యండమూరి తదితరులు నేటికీ చందమామలోని తమ రచనలను గురించి చెబుతుంటారు.
‘చందమామ’ కథల ఎంపిక కోసం ఎంతో కసరత్తు జరిగేదని దాసరి సుబ్రహ్మణ్యం గతంలో చెప్పారు. నాటి సామాజిక సమస్యలు కథలలో ప్రతిబింబించేవి. కానీ అవన్నీ ఉపన్యాసాలుగా కాకుండా కుటుంబం మొత్తం చదివి ఆనందించి ఆలోచింపజేసేవిగా ఉండేవి. సీరియల్స్ విషయంలోనూ అంతే. కథలు, సీరియల్స్ భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. నాటితరం హృదయాలు ‘చందమామ’తో పెనవేసుకుపోయాయి అనటం అతిశయోక్తి కాదు. దెయ్యాలు, దేవుళ్ళు, మంత్రాలు, తంత్రాలు ఇలా ఒకటేమిటి ప్రతిపాఠకుడిని ఆలోచింపజేస్తూనే ఆనందింపచేసేది ‘చందమామ’.
ప్రతి అక్షరంతోనూ తన్మయత్వం
‘చందమామ’ ముఖచిత్రాలను వడ్డాది పాపయ్య గారు వేసేవారు. ఆయన బొమ్మలలో వాటర్ కలర్స్ వెనుక ‘వ్యక్తి’ ‘సమాజ జీవితం’లోని ‘వాస్తవికత’ కనిపించేది. ఆయన ‘చందమామ’కు మాత్రమే ముఖచిత్రాలను వేసేవారు. అందుకోసం ఆయన తపించేవారు. శ్రీకాకుళం వారైనా సరే... వ.పా. గారు ‘చందమామ’ కోసం చెన్నై వెళ్లడం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. ఇది ప్రస్తుతం అప్రస్తుతం. కానీ ఆయన వేసిన ముఖచిత్రాల కోసం పత్రికను కొన్నవారు ఉన్నారు. కొన్న తర్వాత కొనసాగించిన వారు ఉన్నారు. అంతటి ఆకర్షణ ‘చందమామ’ది. పత్రికకు ఉంచిన శీర్షిక కూడా ఆకర్షణీయంగా ఉండాలని చక్రపాణి గారి ఆలోచన. స్వతహాగా ఆయన మంచి సహృదయుడు, అనువాదకుడు, సాహితీవేత్త. విజయ వెనుక ‘విజయాల’లో ఆయన పాత్ర ఎంత అమోఘమైనదో అందరికీ తెలిసిందే. ‘జ్యోతి’ నిర్వహణలో కూడా ఆయన తనదైన ముద్రను వేసుకోగలిగారు. చందమామ ఆనాడే ఎన్నెన్నో ప్రయోగాలకు ‘వేదిక’గా నిలిచిందని ఆ సంస్థలో పనిచేసిన వారు చెప్పిన జ్ఞాపకం. పుస్తకాలు ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రక్రియలో పరిమళం కోసం సెంటు వాడిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఎంతోమందిని ఆకర్షించేది. పైన పరిమళం కన్నా లోపలికి కథలు, సీరియల్స్ లోని సాహితీ మధురిమను ఆఘ్రాణించే వారు ఈనాటికి ఉన్నారు. దాసరి సుబ్రహ్మణ్యం వంటి వారు ‘చందమామ’తో వారికున్న అనుబంధాన్ని ఎంతో ఆర్ద్రతతో ఆత్మీయంగా అక్షరీకరించుకున్నారు. ‘చందమామ’ సంచిక మార్కెట్లోకి రాగానే కొనుక్కొని ఒక్కసారి పేజీలను తృప్తిగా వాసన చూసే ఆనందించే, అనుభూతి చెందే వారున్నారు. ఆ పత్రికలోని ప్రతి అక్షరం ప్రతి పేజీతోనూ తన్మయత్వం చెందిన పాఠకులు ఉండేవారు. అదే ఆ పత్రిక విజయ సూత్రం.
ఏడు దశాబ్దాల కథ ముగింపు వెనక..
‘చందమామ’తో పోటీగా ‘బొమ్మరిల్లు’ ‘బాలమిత్ర’ వంటి పత్రికలు వచ్చాయి. కానీ ప్రింటింగ్, పేపర్ క్వాలిటీలో దూరంగానే ఉండిపోయాయి. కథలు ఎంపిక, ఫోటో వ్యాఖ్య పోటీ వంటివి ‘చందమామ’ ప్రత్యేకతలు. ఫోటో వ్యాఖ్య పోటీలో బహుమతి పొందితే అదేదో ‘ఆస్కార్’ అందుకున్నంతగా పొంగిపోయి ఆనందించేవారని నాకు తెలుసు. ‘బొమ్మరిల్లు’ కొంతవరకు ‘చందమామ’కు దగ్గరగా వచ్చినా ‘బాలమిత్ర’ వంటివి దూరంగానే ఉండిపోయాయి. తర్వాత కాలంలో ‘బాలజ్యోతి’, ‘బాలభారతం’ వంటివి వచ్చాయి.. వెళ్లిపోయాయి. మఖలో పుట్టి పుబ్బలో మాయమైన పిల్లల పత్రికలు సహితం ఎన్నో వచ్చాయి. కానీ ‘చందమామ’ చందమామే.. కాలక్రమంలో ‘చందమామ’ కూడా కొంతకాలం ప్రచురణకు విరామం ప్రకటించింది. మళ్ళీ పుంజుకుంది. వారసులు అందిపుచ్చుకున్నారు. కొన్నాళ్లు బాగానే నడిచింది. ‘వ్యాపారాత్మకత’ సాహిత్యపు అవకాశాలను క్రమంగా దూరం చేసింది. రాసేవారు కూడా కరువయ్యారు. లుక్ కల్చర్.. పెరిగింది. బుక్కు కల్చర్ తగ్గింది. క్రమంగా ‘చందమామ’ను లాభనష్టాల రాహువు తనలోకి లాగేసుకుంది. ఏడు దశాబ్దాల కథ అలా మసక బారింది. కనిపించకుండా పోయింది. వెన్నెలలు కురిపించాలి అనుకునే వారు కూడా చీకట్లో దాక్కొనక తప్పదు. మళ్ళీ ‘చందమామ’ లాంటి గొప్ప నైతిక సాహిత్య విలువలున్న పత్రిక వస్తుందని పిల్లలను పెద్దలను అలరిస్తుందని ఆశించటం అత్యాశ కాదేమో…!
- భమిడి పాటి గౌరీశంకర్
94928 58395
- Tags
- Chandamama