కవిమాట: లాఠీ

by Ravi |   ( Updated:2023-02-26 18:30:38.0  )
కవిమాట: లాఠీ
X

కొట్టండి కొట్టి కొట్టి చంపండి

మిమ్ములను అడిగేటోడెవడు

మిమ్ములను ప్రశ్నించేవాడెవడు.

ఈ సమాజంలో

ఎవ్వడికి ఇవ్వనిది

మీకు లాఠీ తుపాకీ

ఇచ్చి పంపింది కదా..!

మా కింది కులాల వీపులు

పగిలేటట్టు, రక్తం చిట్లేటట్టు

కనుగుడ్లు తేలేటట్లు

చర్మం ఊడిపోయేటట్లు

మీ లాఠీలు విరిగేదాకా కొట్టండి.

మా పేదలు కడు పేదలు

కనిపిస్తే చాలు

కండ్లు ఎర్రగా చేసి

కసినంత నింపుకొని

మనుష్యులనే ధ్యాసమరిసి

కొట్టి చంపేయండి.

ఊరి దొరల పంతాలకు, పగలకు

మా వాళ్ల మీద లేనిపోని అభాండాలు మోపి

అసలు దొంగలను వదిలేసి

అమాయక జనాల జననాంగాలకు

తాళ్ళు కట్టి కొట్టండి.

మీ బూట్ల కింద మా మొఖాలను నలిపేసి

మీ ఉమ్మినంత మా జాతుల

మొఖంమీద ఉమ్మేసి

గోర్ల నడుమ సూదులు గుచ్చి

కీళ్ల సందున కట్టెలు దూర్చి కొట్టి చంపేయండి.

కూలీల మీద, రైతుల మీద

అట్టిట్ట పెరిగిన ఎల్లాపు కులాలమీద

బక్కసిక్కిపోయిన జనాలమీద

హక్కుల కోసం పిడికెడు బువ్వముద్దల

కోసం గొంతెత్తినప్పుడే

మీ లాఠీలు తుపాకీల తూటాలు పనిచేసేది.

కసిదీరా పగతీరే వరకు

పండ్లు పటపటమని కొరికి

అగ్రకుల జాడ్యం ఒళ్లంత నింపుకొని

మా అట్టడుగు వర్గాలమీద

అక్కసంతా కూడగట్టుకొని కొట్టి చంపండి.

బలిసినోడు తప్పుజేస్తే కుర్చీల మీద

కూసోబెట్టి రాచమర్యాదలు చేయండి

కడుపుల పేగులు లేనోడు తప్పుజేయకున్న

తలకిందులుగా వేలాడదీసి కోదండమేసి కొట్టండి.

మీ లాఠీలు కొట్టేదైన

మీ తూటాలు పేలేదైన

మా పేదలపైనే..

ఉన్నోడి బంగ్లా గడపను కూడా

దాటలేవనేది ఓ నగ్న సత్యం.

కొట్టండి కొడుతూనే ఉండండి

కానీ ఒక్కమాట

మా ప్రజలు తిరగబడనంత వరకే

మీ లాఠీలు తుపాకీ తూటాలు

పనిచేస్తాయనే సంగతి మాత్రం మరువకుర్రీ…

(పేదలను లాఠీల దెబ్బలతో చంపేసి బలిసినోళ్ల భజన చేస్తున్న కొందరి కోసం రాసిన కవిత.)


అవనిశ్రీ

99854194243

Advertisement

Next Story

Most Viewed