సీమరైతు కన్నీటిగాధ

by Ravi |   ( Updated:2023-09-03 18:30:31.0  )
సీమరైతు కన్నీటిగాధ
X

ఓ దేవా… వరుణ దేవా…

ఓ సారి వినవయ్యా…

సీమ రైతు కన్నీటి గాధల్ని

మండుతున్న ఎండల్లో

ఎండుతున్న పంటల్లో

శరీరం నుంచి కారే చమట చుక్కల్లో

వర్షపు చుక్కల్ని చూస్తున్న

సీమ రైతుని చూడవయ్య…

పెన్నా నదిలో నీరెండిపాయే

సీమరైతు పొలంలో నీరు తడారిపాయే

చిత్రావతి చిందులాగిపాయే

నా సీమరైతు గుండెలాగిపాయే

పాపాగ్ని పరవళ్ళు నిలిచిపోయే

బహుదా పలకరింపులు మూగబోయే

నీటి జాడలేని సీమ నదులు ఇసుక తిన్నెలాయే

ఆ ఇసుక తిన్నెల మీద రాబందులు పీక్కుతున్న

పీనుగుల దేహాలను చూసైనా

నీ మనసు కరుగకపాయే

సీమరైతుల కష్టాలకు కొదువలేదు

కన్నీళ్ళకు అదుపులేదు

వర్షపు చుక్క నీటి జాడలేదు

బక్క చిక్కిన దేహంతో

నెర్రెలు వారిన నేలలో

ఎండిన కంది చేలలో

వాన చినుకు కోసం ఎదురు చూస్తున్న

సీమరైతును చూడవయ్యా…

రాయలేలిన నాటి రాయలసీమలో

రత్నాలు రాశులుగా ఉండే

నేడు రాక్షసుల పాలనలో

సీమలో రాళ్లు మాత్రమే మిగిలిపాయె

ఆ రాళ్ల సందుల్లో పుడమి తల్లి గర్భాన్ని

చీల్చుకుంటూ ఒక్క మొక్కైనా మొలుచకపాయె

రాళ్లు మిగిలిన నా సీమపై

నీ చూపు కూడా చిన్నబోయే

చినుకు రాలితే చాలు

సీమలో సిరులు పండిస్తాం

ఆకాశాన్ని రెండు చేతులతో గట్టిగా

ఒడిసి పట్టి పిండినా కూడా చినుకు

రాలనంతగా మాపై కక్ష పెంచుకున్నావ్

సీమ రైతుకు పండుగలుండవ్

పబ్బాలుండవ్

వర్షం వస్తే అదే మాకు పెద్ద పండుగ

పంట పండితే అదే మాకు పరమాన్నం

సీమలో ఆకలికేకలు తప్ప

రైతు కళ్ళల్లో ఆనందమే లేకపాయె

కన్న కరువు సీమను వదిలి

కన్నడ సీమ వైపు వలస బాట పట్టిన

సీమ రైతుని చూడవయ్య

మమ్ములను ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపాయె

ఏ పాలకులు పట్టించుకోకపాయెరి

కనీసం నీవైనా మాపై కరుణించి

సీమ పుడమిని తడుపవయ్యా వరుణ దేవా…

-కోనేటి నరేష్,

8499847863

Advertisement

Next Story

Most Viewed